TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీజేఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ!

Published on: Sat Aug 20, 2022 1:57PM

మ‌న దేశంలో ఎప్పుడైనా  ఏదైనా జరగొచ్చు. నేరాలూ, ఘోరాలు చేసిన వారికి రాచమర్యాదలు, బాధితులకు మానసిక వేదన కలుగే సంఘటనలు సామాన్యంగా మారిపోయాయి. హ‌త్య‌, మార‌ణ‌హోమం, అత్యాచారాల‌కు కాలంతో సంబంధం లేదు. బాధితుల్లో మరణించిన వారు మరణించగా, బతికున్న వారు ఎందుకు బ‌తికున్నామా అని జీవితాంతం ఏడుస్తుంటారు. నిందితులు మాత్రం చ‌ట్టాల లోపాల్ని అడ్డుపెట్టుకుని జైలు జీవితాన్ని మామూలుగానే గ‌డిపేసి, ఎంతో మారామ‌ని ఆస్కార్ న‌ట‌న ప్ర‌ద‌ర్శించి బ‌య‌ట ప‌డుతున్నారు. అలా బ‌య‌ట‌ప‌డ్డారు బిల్కిస్ బానో కేసులో నిందితులు. పైగా వారికి ఘ‌న స్వాగ‌త‌మూ ల‌భించింది. ఇలాంటి సంఘటనలతో మ‌నం ప్ర‌జాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. మ‌రీ దారుణ‌మేమంటే దోషుల్ని కూడా కుల‌ గ‌జ్జితోనే చూడ్డం. ఇంత‌కంటే కుసంస్కారం మ‌రోటి ఉండ‌దు. దేశ‌భ‌క్తి గురించి భారీ ఉప‌న్యాసాలిచ్చే బీజేపీ మ‌హా నేత‌లు ఇలాంటి దోషులకు సంస్కార‌వంతులు అని లేబుల్ వేయ‌డాన్ని మించిన దారుణం మ‌రోటి ఉండ‌దు. అందుకే దేశంలో ప్ర‌జ‌లు, విప‌క్షాలు బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల విరుచుకుప‌డుతున్నారు.  

ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఓ లేఖ రాశా రు. బిల్కిస్ బానోపై అ‌త్యాచారం జ‌రిగిన స‌మ‌యంలో ఆమె 5 నెల‌ల గర్భిణీ అన్న విష‌యాన్ని త‌న లేఖ‌లో ప్ర‌స్తావించిన క‌విత‌, ఈ కేసులో దోషుల విడుద‌ల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పందించాల‌ని, దేశ ప్ర‌జ‌ల్లో న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఇనుమ‌డింప జేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  కోరారు.

బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను.. గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకో వాలని జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆ లేఖ లో కోరారు. 2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో బాధతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రూపొందించిన 1992 విధానం ఆధారంగా.. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం.. వారిని రెమిష‌న్ కి అనర్హులను చేయాలని లేఖలో ప్రస్తావించారు.

రేప్ వంటి నేరాలు సామాజిక స్పృహను కుదిపేస్తాయనీ.. శిక్ష పడిన రేపిస్టులు స్వతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో.. ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతోందని కవిత లేఖ రాశారు. బిల్కిస్ బానో కేసును సీబీఐ  దర్యాప్తు చేసిందని.. సీబీఐ ప్రత్యే క కోర్టు వారికి శిక్ష విధించిందని గుర్తుచేశారు ఎమ్మెల్సీ కవిత. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం.. విడు దల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతుందని లేఖలో ప్రస్తావించారు.
ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు.. కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్  ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. క్రిమినల్ అప్పీల్ నెంబరు 490-491/2011 కేసులో.. 2012 నవంబరు 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు.. 1992 నాటి విధానం స్థానంలో.. 2014లో సవరించిన రెమిషన్ విధానం వచ్చిందని కవిత గుర్తు చేశారు. ప్రభుత్వాలు రెమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించవద్దని.. స్వాభావిక ప్రక్రియ, వాస్తవిక దృష్టితో రిమి షన్ అధికా రాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని లేఖలో వివరించారు. 11 మంది దోషులను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంలో.. తగిన ప్రక్రియ, వాస్తవిక దృష్టిని పరిగణలోకి తీసుకున్నారో లేదో స్పష్టత లేదన్నారు. ఈ క్రూరమైన నేరం జరిగినప్పుడు బిల్కీస్ బానో వయస్సు 21 సంవత్సరాలు అని.. ఆమె ఐదు నెలల గర్భిణీ అని కవిత రాసిన లేఖలో ప్రస్తావించారు. రేపిస్టులు బయటకు రావడాన్ని.. ఈ పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బానో మనసు ముక్కలయ్యి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని.. దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కవిత సీజేఐని కోరారు. చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నాను అని కవిత లేఖ రాశారు.