యోధులే అయినా… హీరోలుగా గుర్తింపబడని కట్టప్పలెందరో!


బాహుబలి సినిమాలో హీరో ఎవరు? ఇంకెవరు… బాహుబలిగా కనిపించిన ప్రభాస్! కాని, బాహుబలితో సమానంగా క్రేజ్ సంపాదించిన మరో క్యారెక్టర్ కట్టప్ప! కట్టప్ప రాజమౌళి తాలూకూ కట్టలు తెంచుకున్న క్రియేటివిటికి వెండితెర సాక్ష్యం! ఆ ఒక్క పాత్రతో జక్కన్న తనలోని కమర్షియల్ ఎంటర్టైనర్ ని నూటికి నూరు శాతం బయటపెట్టుకున్నాడు! బాహుబలి ది బిగినింగ్ చివర్లో కట్టప్ప చేత బాహుబలినే చంపించి… దేశం మొత్తాన్నీ విభ్రాంతికి గురి చేశాడు! ఇప్పుడు బాహుబలి ది కన్ క్లూజన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఒకే ఒక్క ప్రశ్నతో సతమతం అవుతున్నారు… ‘’కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’’ !

 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న కొశన్ ఎంత తీవ్రంగా చర్చలోకి వచ్చిందంటే… ప్రధాని నరేంద్ర మోదీ కూడా కట్టప్పని కాదనలేకపోయారు! యూపీ ఎన్నికల్లో తానే కట్టప్పనని చెప్పుకున్న ఆయన ఉత్తరప్రదేశ్ మాహిష్మతీ రాజ్యం కైవసం చేసుకుని సంరక్షకుడిగా యోది ఆదిత్యనాథ్ ను నియమించారు కూడా! ఇలా మొత్తానికి కట్టప్ప… బాహుబలి సినిమాలో మిగతా అందరి కన్నా ఫేమస్ అయిపోయాడు!

 

ఒక్కసారి మనం కట్టప్ప వెనుక వున్న పురాణ ప్రేరణ చూస్తే…  ఆ పాత్రకి సరిగ్గా సరిపోయేది మహా భారతంలోని భీష్ముడే! ధర్మరాజు, దుర్యోధనుడి లాంటి బాహుబలి, భళ్లాలదేవా… ఇద్దరి మధ్యా కట్టప్ప భీష్ముడిలాగే మిగిలిపోతాడు! చివరకి భీష్ముడిలాగే దుర్యోధనుడి లాంటి చెడ్డవాడైన భళ్లాలదేవుడి వైపు నిలబడి బాహుబలిని బలి తీసుకుంటాడు! అయితే, కట్టప్పలో కర్ణుడి పాత్రని కూడా చొప్పించారు రాజమౌళి, విజయేంద్రప్రసాద్! కర్ణుడిలాగే కట్టప్ప నిజమైన యోధుడు. దుర్యోధనుడి లాంటి భళ్లాలదేవుడికి అసలైన బలం. కరుక్షేత్రంలో భీష్మ, కర్ణులు వున్నంత వరకే దుర్యోధనుడి ఆటలు నడుస్తాయి. తరువాత అర్జునుడిదే పై చేయి అవుతుంది. బాహుబలి పార్ట్ 2లో కట్టప్ప ఏం చేస్తాడనే దానిపైనే శివుడి అంతిమ విజయం ఆధారపడి వుంటుంది!

 

ఇప్పటి మన రాజకీయాల్లోనూ చాలా మంది కట్టప్పలే కనిపిస్తుంటారు! అయితే, పూర్తిగా కట్టప్ప అంత అంకితభావం, స్వామిభక్తి, వీరత్వం… అన్నీ ఆశించలేం. కాని, చాలా పార్టీల్లో కట్టప్ప పాత్ర పోషించిన… పదవులు పొందలేని యోధులు మాత్రం వున్నారు! దేశ ప్రధాని కావాలని బలంగా కోరుకున్న అద్వానీ ఒక రకంగా బీజేపీలో భీష్మ పితామహుడే! అంటే కట్టప్పే! కారణాలు ఏమైనా… దిల్లీలో బీజేపీ జెండా రెపరెపలాడించిన ఆయన ఆ దిల్లీని మాత్రం ఏలలేకపోయారు! ములాయం సింగ్ యాదవ్ పార్టీలో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ ది కూడా కట్టప్ప రోలే! పార్టీ కోసం ఎంతో చేసిన ఆయన అవమానాలకు గురై బయటకొచ్చేయాల్సి వచ్చింది! శివసేనలోని రాజ్ థాక్రే కూడా కట్టప్పలా తెగించి పోరాడాడు పార్టీ కోసం. చివరకు, అన్నీ వదులుకుని బయటకు రావాల్సి వచ్చింది. కట్టప్ప లాంటి రాజ్ థాక్రే, రాజ్ థాక్రే లాంటి ఒక మాస్ నాయకుడు… మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక పార్టీలో వున్నాడని పొలిటికల్ పండితులు అంటుంటారు! ముందు ముందు ఆయన భవిష్యత్ ఎలా వుండబోతోందో?