కథువా అత్యాచార కేసులో కోర్టు తీర్పు

 

 

ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్ రేప్-మర్డర్ కేసులో ఇవాళ పఠాన్‌కోట్‌ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురుని దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. వీరిలో ప్రధాన నిందితుడు సాంజిరామ్‌తో పాటు అతని మేనల్లుడు ప్రవేశ్ కుమార్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దీపక్ ఖజూరియాకకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో ముగ్గురు పోలీసులు హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ , స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సురేందర్ వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తలకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష  విధించింది. ఇక ఏడో నిందితుడు సాంజిరామ్ కుమారుడు విశాల్ జంగోత్రని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా  నిర్దోషిగా ప్రకటించింది.

గత ఏడాది జనవరిలో జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లా రసానా గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యచేశారు. 2018 జనవరి 10న ఈ చిన్నారి గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరి 17న గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మ‌ృతదేహం లభ్యమైంది. బాలికను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. భూవివాదమే ఈ చిన్నారికి హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. 

రాసానా గ్రామంలో బక్రవాల్ అనే సంచార తెగ వారు ఉంటారు. వారి రవాణాకు వినియోగించే గుర్రాలను గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి మేపుతుంటారు. భూముల వ్యవహారం, పొలాల్లో గుర్రాలను మేపే అంశంపై ఈ తెగవారికి, గ్రామస్థులకు మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో బక్రవాల్ తెగపై కక్ష పెంచుకున్న రెవెన్యూశాఖ మాజీ ఉద్యోగి, పూజారి సాంజీ రామ్ ఏలాగైనా ఆ సంచార తెగను గ్రామం నుంచి తరిమేయాలని పథకం రచించి దాన్ని పక్కాగా అమలు చేసాడు. గత ఏడాది జనవరి 10న గుర్రాలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ దేవాలయంలో బంధించారు. గుళ్లో ఆ చిన్నారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరుగా పసిపాపపై తమ పశవాంఛను తీర్చుకున్నారు. అనంతరం రాయితో చిన్నారిని కొట్టి చంపి అడవిలో విసిరేశారు. తమ చిన్నారి ఏమైందోనని భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారం తర్వాత చిన్నారి డెడ్‌బాడీ దొరకడంతో నిందితులు అప్రమత్తమయ్యారు. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు సాంజీరామ్‌ స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో లంచాలు ముట్టచెప్పాడు.

బాలిక మృతదేహం లభ్యమైన తర్వాత ఈ కేసును ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేయడంతో అందరి బాగోతాలు బయటపడ్డాయి. ఆలయ పూజారి సాంజీరామ్‌తో పాటు అతడి 22 ఏళ్ల కుమారుడు, 3 పోలీస్ అధికారులుతో పాటు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చింది. మొదట ఈ కేసును జమ్ముకశ్మీర్‌ న్యాయస్థానం క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించింది. అక్కడ పరిస్థితులు దర్యాప్తునకు అనుకూలంగా లేకపోవడంతో కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ కోర్టుకు కేసును బదిలీ చేసింది. ఈ కేసులో సోమవారం తీర్పు వెల్లడించిన కోర్టు ఆరుగురిని దోషులుగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. సాంజిరామ్ కుమారుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఐతే అతడు కూడా దోషేనని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారందరినీ ఉరితీయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.