కత్తి మహేష్ నగర బహిష్కరణ.. తండ్రి స్పందన

 

కత్తి మహేష్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనే ఉద్దేశంతో పోలీసులు మహేష్ ని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే.. ఈ చర్య పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేసారు.. అయితే మహేష్ తండ్రి మాత్రం తన కొడుకులాగానే భిన్నంగా స్పందించారు.. 'ఏ విషయమైనా సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేనిదే మా వాడు మాట్లాడడు.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మావాడికి నగర బహిష్కరణ విధించామంటున్నారు.. మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే స్వామీజీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు' అని మహేష్ తండ్రి ఓబులేశు ప్రశ్నించారు.. ఉన్నత చదువులు చదివిన తన కుమారుడు అకారణంగా ఎవరి మనోభావాలనూ గాయపర్చడనే నమ్మకం తనకు ఉందన్నారు.

ప్రతి ఒక్కరికీ విభిన్న అభిప్రాయాలు ఉంటాయని, మనోభావాలు దెబ్బతింటున్నాయన్న సాకుతో ఇతరులపై మన అభిప్రాయాలు రుద్దడం మంచిది కాదని ఓబులేశు పేర్కొన్నారు.. అయితే మహేష్ తండ్రి వ్యాఖ్యల పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. కాని ఇలా ఒక మతం దేవుడిగా కొలిచే రాముడిపై వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు.. నీకు ఇష్టం లేకపోయినా పూజించు అని ఒత్తిడి చెయ్యట్లేదు కదా.. ఇష్టమైతే పూజించు.. నచ్చకపోతే పట్టించుకోకు.. అంతే కాని ఇలా పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.