కాశ్మీర్ వారికి సినిమాకాదు, ధైర్యం కావాలి!
Published on: Sat Jun 4, 2022 11:29AM
ఎవరికయినా పుట్టి పెరిగిన వూరు మీద ఎంతో ప్రేమ వుంటుంది. ఉద్యోగం పేరుతోనో, వ్యాపారం కోసమైనా వేరే ప్రాంతానికి వెళ్లినా పుట్టిన ఊరుని మర్చిపోలేరు. ఆంగ్లంలో ఒక సామెతా వుంది పిల్లాడిని వూరి నుంచి పంపేయచ్చు గాని, వూరుని పిల్లాడి నుంచి దూరం చేయలేరు! మరి కాశ్మీరీ పండితుల సంగతి అంతేగదా! వుండ లేక కాశ్మీర్ ప్రాంతం విడిచి వెళిపోవడం గతంలో జరిగింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున వెళిపోవడం చాలా దారుణం. మరి దేశ పాలకులు వారిని పట్టించుకోరా అని ఈసారి గట్టిగానే అడిగేరు ఆమ్ ఆద్మీ నాయకుడు సంజయ్ సింగ్. వారికి ఎంతో చేసాం, వారి రక్షణ మా ప్రథమ కర్తవ్యం అని ఎక్కడ పడితే అక్కడ, దాదాపు ప్రతీ వేదిక మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇకనయినా ప్రధాని, ఆయన మంత్రివర్గం మానుకోవాలని ఇప్పటికే చాలామంది హితవు పలికేరు. కాశ్మీర్‌కి ఎంతో మేలు చేసామని, లోయ ప్రాంతాన్ని ఓట్ల కేంద్రంగా మార్చు కోవడం తప్ప నిజానికి వారి జీవితేచ్ఛకి, భయాందోళనలు పొగొట్టడానికి కేంద్రం పూనుకుని ఏం చేసింది? మరీ దారుణమేమంటే, వున్నచోటనే మేము వేరే ప్రాంతీయులం అనే భావనతో బతకాల్సి రావడం. దీన్ని ఊహించుకోవడమే చాలా కష్టం. మరి కాశ్మీరీ పండిట్‌లు ఆ బాధను ఇన్నేళ్లుగా ఎలా భరిస్తున్నారో శివుడే ఎరుక!
1990 లో బిజెపి మద్దతుతో అధికారంలో వున్న ప్రభుత్వం కాశ్మీరీ పండిట్‌లకు నిద్రలేకుండా చేసింది. వారు గూళ్లు వదిలి వేరే ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వెళిపోయేరు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పూర్తి మెజా రిటీతో గెలిచి మరింత ధైర్యంగా కాశ్మీరీ పండిట్‌ల జీవితాలు విచ్ఛిన్నం చేసిదని పరిశీలకులు అంటు న్నారు. 1990లో భారీఎత్తున వారు అన్నీ వదులుకుని వేరే ప్రాంతానికి వెళ్లడాన్ని కళ్లారా వీక్షించిన అప్పటి కాశ్మీర్ గవర్నర్ జగమోహన్‌కి మోడీ ప్రభుత్వం ఏకంగా పద్మశ్రీ ఇచ్చి గౌరవించడం బిజెపి ప్రభుత్వం మన సును ప్రజలు మరింతగా తెలుసుకునేలా చేసింది. వారికి మేలు చేసిన వారిని గౌరవించ డంలో తప్పు లేదు.
కానీ లక్షలాది మందిని ఊహించని స్థితిలో వారి ప్రాంతంనుంచి తరిమేయడంలో సహక రించిన వారికి వెన్నుదన్నుగా నిలవడం ఎంతవరకూ సమంజసం. లోయలో తీవ్రవాదుల హత్యాకాండను బిజెపి ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా చూడడం, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్‌ల రక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకొనకపోవడం కేంద్రం సహజ యాన పంథాగానే తీసుకోవాలా? ఎందుకంటే, అసలు కాశ్మీర్ లోయ ప్రాంతంలో జరుగుతున్న దారుణాలు, హత్యలన్నీ కూడా పక్కనే వున్న పాకిస్తాన్ తీవ్రవాదుల చర్యలే అని ఒక్క మాటతో కొట్టేయడం ఎంతవరకూ నమ్మశక్యం. పోనీ అదే నిజమని అనుకున్నా లోయ ప్రాంతీయుల జీవనానికి కనీస రక్షణ కల్పించలేని కేంద్ర ప్రభుత్వంతో ప్రయోజనమేమిటని పరిశీలకుల ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న ఆమ్ ఆద్మీ లేదా కాంగ్రెస్ వారు వేయడం కాదు స్వయానా బిజెపి వర్గాలు, కేంద్ర మంత్రి వర్గం వేసుకోవాలి. మొన్నీమధ్యనే ఇలాక్వాయి దెహాతీ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్‌ను కుల్‌గ్రామ్‌లో తీవ్రవాదులు చంపేసేరు. ఇటీవల జరిగిన హత్యల మీద అన్ని పార్టీలవారూ కేంద్రాన్ని దుమ్మెత్తి పోశారు. కానీ దున్నపోతు మీద వాన సామెతే అయింది!
భయభ్రాంతులకు గురయిన లోయప్రాంతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించామంటున్నారు. మరి అక్కడే వున్న వారిని అలా వదిలేస్తారా? మరి వారి రక్షణ సంగతి ఏంటి? వారు ఇల్లు, గొడ్డు గోతం అన్నీ వదిలేసుకుని పిల్లాజెల్లాతో వేరే ప్రాంతానికి వెళిపోవలసిందేనా? అమాయకులయిన కశ్మీరీ పండిట్‌లను ఇళ్లకే పరిమితం చేయడంతో వారి కాలనీలన్నీ జైళ్లుగా మారాయని ప్రతిపక్షాలు వారి తరఫున గొంతు చించుకుంటున్నారు.
కానీ సర్వాధికారులవారు ఏం చేస్తున్నారు.. కశ్మీరీ ఫైల్స్ అనే చిత్రరాజాన్ని ఎంత బాగా ప్రచారం చేయవచ్చనేది చాలా కీలకాంశంగా చేసుకున్నారని ఆమ్ ఆద్మీ నేత సింగ్ వ్యాఖ్యానించేరు. నిజమే మరి.. రక్షణ కల్పిస్తామని ప్రచారాలు చేయడం తప్ప వాస్తవానికి కాశ్మీరీ పండిట్‌ల జీవితాల్ని దాడులకు వదిలేయడం తప్ప కేంద్రం చేసిందేముందని విశ్లేషకులు నిలదీస్తున్నారు. వాస్తవ మద్దతు, వెన్నుదన్నుగా నిలవడం ఇప్పుడు మరీ అవసరం. కేంద్రంలో పెద్దాయన జ్ఞానంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే చూడాలని కాశ్మీర్ లోయ ప్రాంతీయులతోపాటు దేశమంతా ఎదురుచూస్తోంది.


