TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు

Published on: Fri Apr 25, 2025 4:34PM

 

జమ్ముకశ్మీర్‌‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ చంద్రమౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా.. భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. ఈ రోజు చంద్ర మౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోధించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

అలాగే మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడి మోసారు. అశృనయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జ్ఞానాపురం స్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధువులు, వేలాదిగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్‌ పార్థివ దేహానికి నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మధుసూదన్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.