అంపశయ్యపై "కరుణ"

తాను ఎప్పుడు మరణించాలో నిర్ణయించుకున్న మహానుభావుడు భీష్ముడు. భారతంలో భీష్ముడ్ని మించిన ధీరుడు లేడు. భారతంలో భీష్ముడికి మించిన యోధుడూ లేడు. దక్షిణ భారతదేశంలో ఆనాటి భీష్ముడికి సరితూగే నాయకుడు తమిళనాట పుట్టాడు. ఆయనే నేడు అంపశయ్యపై ఉన్న కలియుగ భీష్ముడు ముత్తువెల్ కరుణానిధి. నేటి రాజకీయాలను... నేటి సినిమాలను... నేటి సమాజాన్ని చూసి కరుణానిధిని అంచనా వేయడం ఏమంత మంచిది కాదు. ఆయన దీక్షాదక్షతులు తెలియాలంటే కాసింత వెనక్కి వెళ్లాల్సిందే. విప్లవ పోరాటమంటే తెల్లగుర్రమ్మీద స్వారీ అనుకున్నావా నా స్వామీ అన్నాడు ఓ విప్లవ కవి.ఆ మాటలు కరుణానిధికి సరిగ్గా అతికినట్లు సరిపోతాయి. రాజకీయ పోరాటమంటే తెల్ల గుర్రం మీద స్వారీ కాదని కరుణానిధికి ఎప్పుడో... ఏనాడో తెలిసింది. పోరాటం గురించి తెలుసుకోవాలంటే కరుణానిధి గురించి తెలుసుకోవాలి.

 

 

నిరంతరం నల్ల కళ్లాద్దాల వెనుక దాగి ఉన్న ఆ కళ్లలోని కసిని... ఆరాటాన్ని.... ఏదో చేయాలనే ఆరాటాన్ని తెలుసుకోవాలంటే కష్టమే. ఆ పనిని ఆయన వారసులే చేయలేకపోయారు. అందుకే చెట్టుకొకరు... పుట్టకొకరుగా మారారు. కరుణానిధి అంటే ఓ ముఖ్యమంత్రే కాదు.... ఆనాటి సమాజానికి మిగిలిన ఏకైక తీపి గురుతు. ఆ తీపి గురుతు అందర్ని వదిలి వెళ్లిపోవాలనుకుంటోంది. నిజంగా అలాగే అనుకుంటున్నారా కరుణానిధి. అదే కోరుకుంటున్నారా... కాదు అంటున్నారు ఆయనే. అందుకే గడచిన కొన్ని రోజులుగా ఆయన అంపశయ్యపై ఊగిసలాడుతున్నారు. ఏదో చేయాలనే తపనతో కొట్టిమిట్టాడుతున్నారు. ఆయన ప్రాణాలు తమిళ ప్రజల కోసం ఆరాటపడుతున్నాయి. చావు అందరికి సమానమే అయినా... చావు అందరినీ సమానంగా ప్రేమించలేదు.... సరిగ్గా కరుణానిధి విషయంలోనూ అదే జరిగింది. అదే జరుగుతోంది. 94 నాలుగేళ్ల వయసులో కరుణానిధి మరణంతో పోరాడుతున్నారు. కాదు... కాదు... ఓ విఫలయత్నంతో ఆరాటపడుతున్నారు.

 

సమాజాన్ని మార్చాలనుకోవడమే ఆ విఫల యత్నం. విఫలం అనేది కరుణానిధి ప్రయత్నమే తప్ప లక్ష్యం కాదు... అందుకే 94 ఏళ్ల వయసులోనూ ఆయన శరీరం మరణం వైపు చూడడం లేదు. 1969 సంవత్సరంలో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి 50 సంవత్సరాలు అయ్యింది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్లకే కరుణానిధి తన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకూ ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధికి ఆ పదవి కంటే కూడా కవిత్వం... రచనలు... సాహితీ చర్చలంటేనే ఎక్కువ ఇష్టం. ఆయన జీవితమంతా రచనలతోనూ.... వివిధ స్క్రిప్టులతోనే గడిచింది. తొలినాళ్లలో నాటక రంగంలోనూ... ఆ తర్వాత సినీ రంగంలోనూ రచయితగా వెలుగొందిన కరుణానిధి... తన మిత్రుడు, తమిళ మహా నటుడు ఎం.జీ.ఆర్ గా పిలువబడే ఎం.జి.రామచంద్రన్ తో కలిసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

 

 

ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉన్నంత వరకూ కరుణానిధికి ఢోకా లేకుండానే పోయింది. ఆయన మరణంతో ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయిన కరుణానిధికి రాజకీయ పోరు అప్పుడే జయలలిత రూపంలో ఎదురైంది. జయలలిత బతికి ఉన్నంత వరకూ ఈ ఇద్దరు నేతల మధ్య నీరు కూడా నిప్పుగా మారింది. వీరిద్దరి ఆధిపత్య పోరులో ఒకసారి ఒకరిది పైచేయి అయితే... మరొకసారి వేరొకరిది పైచేయిగా నిలిచింది. అయితే, జయలలిత అధికారంలో ఉండగా చూపించిన కక్షపూరతి చర్యలను కరుణానిధి మాత్రం ఎప్పుడూ చూపించలేదు. ఇది ఆయన రాజకీయ విచక్షణకు గీటురాయి. జయలలిత ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే కరుణానిధి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపించి ఆయనను అరెస్టు చేసిన తీరును తమిళ ప్రజలే కాదు... యావత్ దేశ ప్రజలందరూ తప్పు పట్టారు. అప్పటికే ముదుసలి అయిన కరుణానిధిని తమిళ పోలీసులు కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా ఆయన్ని అరెస్టు చేశారు. ఇది తమిళ ప్రజలకు... ముఖ్యంగా డిఎంకె కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయ కక్షలకు ఆ సంఘటన ఓ మచ్చుతునక. కరుణానిధిలో పరిణితి చెందిన  ఓ రాజకీయ నాయకుడ్ని తమిళ ప్రజ చూసింది. ఆయనలోని పట్టుదల... మూర్తీభవించిన మానవత్వం... ప్రజలకు ఏదో చేయాలనే తపనే ఆయనకు ఇంతటి పేరు తీసుకువచ్చింది.

 

 

తన రచనల్లోనే కాదు... తన ఏలికలో కూడా తమిళనాడులోని బడుగు, బలహీన వర్గాల వారికి కరుణానిధి చేసిన మేలు వారు మరువలేనిది. ఆయన ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదర్శంగా నిలిచాయి. బహుశా అందుకేనేమో... కరుణానిధిని చికిత్స నిమిత్తం చేర్పించిన కావేది ఆసుపత్రికి లక్షలాది మంది చేరుకుంటున్నారు. తమ నాయకుడిని చూడాలని... ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నారు. తమిళనాట అన్ని దేవాలయాలు... మసీదు... చర్చిలు.. ఇతర ప్రార్ధనా మందిరాల్లోనూ కరుణానిధి ఆరోగ్యం కోసం పూజలు జరుగుతున్నాయి. ఒక నాయకుడికి ఇంతకంటే ఏం కావాలి. ఆయన సంపాదించిన కోట్ల ఆస్తులు... తన వారసులు.. తన గెలుపోటముల కంటే ప్రజాదరణ ఎంతో గొప్పదో మరోసారి బహిర్గతమైంది. నిరంతరం ప్రజల కోసం ఆరాటపడే వారి వెంట ప్రజలు వెల్లువలా ఉంటారనడానికి కరుణానిధే ఓ సజీవ సాక్ష్యం. అంపశయ్యపై ఉన్న కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశిద్దాం.