కరుణానిధికి ఏమైంది?

కరుణానిధి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళనగా ఉంది.జ్వరం, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని చూసేందుకు ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు.కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి తదితరులు రాత్రి పదింటి వరకు ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. తాను నవ్వుతున్నానని, దీన్నిబట్టి కరుణానిధి ఆరోగ్యం బాగుందని విశ్వసించాలని దురైమురుగన్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. స్టాలిన్‌ సహా ఇతర నేతలంతా కరుణ నివాసం నుంచి వెళ్లిపోయారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 1.15గంటల ప్రాంతంలో స్టాలిన్‌, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్‌ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అత్యవసర వైద్య నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

 

 

కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వివరించారు.ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ ఫోను ద్వారా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోదీ ఓ ట్వీట్‌ చేశారు. ‘కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్‌, కనిమొళితో మాట్లాడాను. ఏదైనా అవసరమైతే చేస్తానని చెప్పాను... ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా కూడా కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కరుణ ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్‌తో మాట్లాడారు.కమల్‌హాసన్‌, డీఎంకే నాయకులు దయానిధి మారన్‌, దురైమురుగన్‌, సీపీఐ నేత డి.పాండియన్‌లతోపాటు సినీ ప్రముఖులు అక్కడకు చేరుకున్నారు.కరుణ ఆరోగ్యంపై ఆరా తీశారు.ఈరోజు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు చెన్నైకి రానున్నారు.తమ ప్రియతమ నేతను కావేరీ ఆసుపత్రిలో చేర్చారన్న వార్తతో అభిమానులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరారు. దీంతో ఆసుపత్రి వెలుపల భారీ పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు.