సెలవు మహా నాయక సెలవు

ద్రవీడ సూరీడు అస్తమించాడు. తొమ్మిది పదుల జీవితంలో ఆరు పదుల రాజకీయ జీవితాన్ని నెరపిన రాజకీయ దురంధరుడు  కన్నుమూశారు. దైవం... దైవాలయమే జీవితంగా గడిపిన కుటుంబంలో పుట్టి ఆ దైవం అస్తిత్వాన్నే ప్రశ్నించి... చివరి వరకూ నాస్తికునిగా జీవించిన ఆ మహా మనిషి అందరిని విడిచి అందని లోకాలకు వెళ్లిపోయారు. కళ్లకుడి కొండ కరుణానిధి. ఇది పెట్టుడు పేరు. అసలు పేరు దక్షిణామూర్తి. ఆ పరమేశ్వరుడి గుడిలో నాదస్వరం వాయించే కుటుంబంలో పుట్టారు.

 

 

అయితే ఆ దేవుడే లేడని, కళ్లకు కనిపించని అవాస్తవాల కంటే ఎదురుగా కనిపించే వాస్తవాలే దైవమని నమ్మి తన పేరును మార్చుకున్నారు దక్షిణామూర్తి. హిందీకి వ్యతిరేకంగా తమిళనాట జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న దక్షిణామూర్తి రైల్వే స్టేషన్ లో  రైలుకు ఎదురెళ్లి మరీ ఉద్యమించారు. ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో దేవుడి పేర్లను వదిలేయాలన్న ప్రేరణతో దక్షిణామూర్తి పేరును కళ్లకుడి కొండ కరుణానిధి... అంటే కళ్లకుడిని గెలిచిన కరుణానిధిగా మారారు.  ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటన తర్వాత కరుణానిధిగానే ఆయన తమిళ ప్రజల మనసు గెలుచుకున్నారు.

 

 

వెనుకబడిన వారి ఆశాదీపం పెరియార్ రామస్వామి, అన్నాదురైల శిష్యుడిగా ఎదిగిన కరుణానిధి వారి సిద్ధాంతాలను జీవిత చరమాంకం వరకూ వదలలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదు పర్యాయాలు పని చేసిన కరుణానిధి తెలుగు వారు.ముత్తువేల్, అంజుగం దంపతులకు జన్మించిన దక్షిణామూర్తిగా జన్మించిన కరుణానిధి పూర్వీకులు తెలుగు వారు. ప్రకాశం జిల్లా. ఎప్పుడో వారి తాతలు బతుకు తెరువు కోసం తమిళనాడుకు వలస వెళ్లిపోయారు. ఇది తెలిసినప్పటి నుంచి కరుణానిధి తనను కలిసేంుదుకు వచ్చిన తెలుగు వారితో చాలా ఆప్యాయంగా... ప్రేమగా ఉండేవారు. మేమూ తెలుగు వారమే అంటూ పలకరించే వారు. చిన్నతనం నుంచి ఉద్యమాలే ఊపిరిగా బతికిన కరుణానిధి నేటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని అందించిన మహనీయుడు. కరుణానిధి చిన్నతనంలోనే ఉద్యమబాట పట్టారు. ఆయన స్వగ్రామం కల్లకుడి పేరును దాల్మియాపురంగా మార్చడాన్ని ఆయన నిరసించారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. అలా ప్రారంభమైన ఆయన ఉద్యమ గుణం జీవిత చరమాంకం వరకూ కొనసాగింది. మాజా ముఖ్యమంత్రి, మహానటుడు ఎం.జీ.రామచంద్రన్ కలిసిన స్నేహం వటుడింతై అన్నంతగా పెరిగి పెద్దదైంది.

 

 

చదివింది ఎనిమిదో తరగతే అయినా కరుణానిధి తన సాహిత్యంతో లక్షలాది మందికి ప్రేరణ అయ్యారు. ఎం.జీ. రామచంద్రన్ మరణంతో డిఎంకె రెండుగా చీలిపోయి కరుణానిధి, సినీ నటి జయలలితల వర్గాలు ఉప్పు, నిప్పుగా మారాయి. వారిద్దరి వ్యక్తిగత వైరం తమిళ ప్రజలను ఇబ్బందులు పాలు చేశాయి. జయలలిత ముఖ్యమంత్రిగా పని చేసినంత కాలం కరుణానిధిపై కక్షపూరిత రాజకీయాలే చేశారు. వీటిని తట్టుకుని మళ్లీ సముద్రంలో అలలా పైకి లేచే వారు కరుణానిధి. తాను బతికి ఉన్నంత వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టివ పరిస్ధితుల్లోనూ వదలని కరుణ, ప్రేమ ఆయనది.

 

 

మరణించినంత వరకూ నాస్తికుడిగా... పెత్తందారితనానికి వ్యతిరేకిగా, ఉత్తర భారతదేశ ఆధిపత్యానికి తలవొంచని వానిగా, అగ్రవర్ఱ దాష్టీకాలను వ్యతిరేకించే మనీషిగానే బతికారు కరుణానిధి. అదే ఆయనను తమిళనాట కోట్ల మందిలో ఒకడిగా కాకుండా... కొట్ల మందికి ఒకడిగా మిగిల్చింది. తమిళ రాజకీయాలు వ్యక్తిగత కక్షలకు ప్రతీకగా నిలుస్తాయి. దీనికి జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా కరుణానిధి చూపించిన కక్ష పూరిత చర్యలే నిదర్శనం. అవే కక్షలు ఇప్పుడు కరుణానిధి మరణం తర్వాత కూడా వెలుగు చూడడం దారుణం. కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం  మాత్రం అందుకు ససేమిరా అంటోంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై మ్యూజియం పక్కన స్ధలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకిగా ఉందంటూ కొర్రి పెట్టింది. ఇది ఓ మ‌‍హా నాయకుడ్ని అవమానించడంగానే పరిగణించాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా ఉన్నట్లుగా చెబుతూనే చేయాల్సన పని చేసేశారు. ఇదీ తమిళ రాజకీయం. ముందు ముందు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకే ఇది చక్కని ఉదాహరణ.

 

 

తమ నాయకుడ్ని మరణాన్ని తట్టుకోలేని అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి శోకం ముందు మెరీనా బీచ్ సముద్రం కూడా తోడైంది. అంతటి మహా నాయకుడి మరణం తట్టుకోలేనిది. ఆ మహా నాయకుడి మరణానికి ఎవరూ బాధ్యులు కాదు. కాలధర్మాన్ని అనుసరించి కరుణానిధి తన శరీరాన్ని వదిలారు. అయితే అనంత వాయువుల్లో కలిసి ఆయన ఆత్మ మాత్రం తమిళ ప్రజల కోసం... వారి పురోగమనం కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు వన్ యాజమాన్యం... సిబ్బంది మనసారా కోరుకుంటోంది. సెలవు మహా నాయక సెలవు.