ఆకాశం లాంటి జీవితం! నక్షత్రాల్లాంటి విశిష్టతలు!

ఇప్పుడు దేశమంతా కరుణానిధి గురించే చర్చించుకుంటోంది! స్వయంగా ప్రధాని మోదీ చెన్నైకి చేరుకుని దివంగత దిగ్గజానికి నివాళి అర్పించారు. 94 ఏళ్ల కరుణానిధి అయిదు సార్లు సీఎంగా తమిళనాడును పరిపాలించి చరిత్ర సృష్టించారు! అయితే, కలైంగర్ ది విలక్షణ వ్యక్తిత్వం. అందువల్లే ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పరమ నాస్తికుడిగా ముద్రపడ్డ ఆయన తల్లిదండ్రులు తనకు పెట్టిన దేవుడి పేరును మార్చుకోవటం మొదలు పెద్ద కొడుకును కాదని చిన్న కొడుకును పార్టీ అధినేతగా నియమించటం వరకూ అడుగడుగునా అంకితభావం, తెలివితేటలు ప్రదర్శించారు. కరుణానిధి జీవితంలోని విభిన్న కోణాల్ని, విశేష అంశాల్ని ఇప్పుడు చూద్దాం.

 

 

1924లో జన్మించిన కరుణానిధి తన సుదీర్ఘ ప్రస్థానాన్ని సాదాసీదాగా ప్రారంభించారు. ఆయన బాగా డబ్బున్నవారు కాదు. పలుకుబడి కలిగిన రాజకీయ , వ్యాపార కుటుంబంలోని వారు కూడా కాదు. మధ్యతరగతి మూలల నుంచీ అంచెలంచెలుగా ఎదిగారు. అయితే, ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి. ఇది శివుడి నామాల్లో ఒకటి. కానీ, క్రమక్రమంగా నాస్తికుడుగా మారిన కరుణానిధి దేవుడి పేరును తాను కలిగి వుండటం అంగీకరించలేదు. అందుకే, దక్షిణామూర్తి కాస్త కాలక్రమంలో కరుణానిధి అయ్యారు. దీని వెనుక కూడా ఒక పెద్ద ఉద్యమమే వుంది.

 

 

కరుణానిధి 14 ఏట నుంచే సామాజిక ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యారు. జస్టిస్ పార్టీ నేత అయిన అళగిరి స్వామి ప్రసంగాలకు ప్రేరితుడై ఒక యువజన సంఘం స్థాపించారు. తరువాతి కాలంలో ఒక విద్యార్థి సంఘం కూడా నెలకొల్పారు! అయితే, కరుణానిధి నాయకత్వ లక్షణాలకి అసలు అవకాశం 1953లో వచ్చింది. అప్పటి నెహ్రు ప్రభుత్వం తమిళనాడులోని కళ్లకుడి అనే ప్రాంతాన్ని దాల్మియాపురంగా మార్చాలని భావించింది. డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, అనాటి 29 ఏళ్ల దక్షిణామూర్తి ఒకడుగు ముందుకేసి కదులుతున్న ట్రైన్ కు అడ్డంగా పడుకున్నారు. చివరకు, అరెస్టై జైలుకి వెళ్లారు. 35 రూపాయల ఫైన్ కట్టమంటే నిరాకరించి సంవత్సరం జైల్లో గడిపారు. ఆఖరుకు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కళ్లకుడి పేరు మార్చలేదు. అందుకోసం తీవ్రపోరాటం చేసిన దక్షిణామూర్తిని జనం కళ్లకుడి కొండ కరుణానిధి ( కళ్లకుడిని జయించిన కరుణానిధి! ) అని తమిళంలో పొగిడేవారు! అదుగో… అలా కరుణానిధి ఆయన మారు పేరైపోయింది! తరువాత అదే అసలు పేరైపోయింది.

 

 

మారిన పేరుతో చరిత్రలో తన పేరు రాసిపెట్టుకున్న కరుణానిధి తన అందరు సంతానానికి తమిళ పేర్లే పెట్టారు. సినిమా రచయిత, కవి అయిన కలైంగర్ కు తమిళం అంటే చాలా ఇష్టం. కాకపోతే, ప్రస్తుతం డీఎంకే పగ్గాలు కరుణ తరువాత అందుకోబోతోన్న స్టాలిన్ కు మాత్రం తమిళ భాషలో పేరు పెట్టేలేదు! అందరిలో కరుణానిధికి స్టాలిన్ అంటేనే ఎక్కువ ఇష్టం! అయినా ఆయనకు రష్యా నాయకుడి పేరు పెట్టటానికి కారణం… స్టాలిన్ చనిపోయేనాటికి కరుణానిధి చిన్న కుమారుడు కేవలం నాలుగు రోజుల పసివాడు. అతడికి స్టాలిన్ అని పేరు పెట్టుకుంటానని కరుణానిధి ఒక బహిరంగ సభలో ప్రకటించారు. అప్పట్లో భారత్ రష్యాకు దగ్గరగా వుండటంతో స్టాలిన్ చనిపోయిన తరువాత అనేక సంస్మరణ సభలు జరిగాయి. అలాంటి ఓ సభలోనే తన కొడుక్కి స్టాలిన్ అని పేరు పెట్టారు కరుణ! స్టాలిన్ కు నిజానికి కరుణానిధి పెట్టాలనుకున్న పేరు… అయ్యాదురై! ఎందుకంటే, ఆయన తన అభిమాన నేత పెరియార్ ను ‘అయ్యా’ అనేవారు. అలాగే మరో మహానేత అన్నాదురైలో దురై అనే పదం వుంది! ఈ రెండూ కలిపి అయ్యాదురై అని పెట్టాలనుకున్నారట. కానీ, అంతలోనే రష్యా కమ్యూనిస్టు పాలకుడు స్టాలిన్ మరణంతో ఆయన పేరు కరుణ కొడుక్కి స్థిరపడిపోయింది! అంతా సవ్యంగా సాగితే వచ్చే ఎన్నికల్లో ఈ భారతీయ స్టాలిన్ తమిళనాడును ఏలే ముఖ్యమంత్రి కావొచ్చు!

 

 

కరుణానిధి రచయిత, కవి అయినా కూడా ఎంతో తెలివితేటలున్న రాజకీయ నాయకుడు కూడా! డీఎంకే పార్టీకి అన్నాదురై తరువాత పెద్ద దిక్కైన ఆయన క్రమంగా ఆ పార్టీని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో ఎంజీఆర్, వైగో లాంటి నాయకుల్ని అవతలకి పంపించాడు. చివరకు, తన కొడుకుల్లోనూ అంతగా నమ్మకం లేని పెద్ద కొడుకు అళగిరిని పక్కకు పెట్టేశాడు. చిన్న కొడుకు స్టాలిన్నే అందలం ఎక్కించారు. ఇప్పుడు డీఎంకేలో తిరుగులేని శక్తిగా స్టాలిన్ ఎదిగిపోయారు. అందుకు కారణం గత రెండు దశాబ్దాలుగా కరుణానిధి స్టాలిన్ ను పార్టీలో అంచెలంచెలుగా పెంచుతూ రావటమే! ఇది కరుణానిదిలోని రాజకీయ కోణం! ఇలాంటి వ్యూహాల కారణంగానే ఆయన సుదీర్ఘ ప్రస్థానం సాధ్యమైంది!

ముఖ్యమంత్రిగా పాలనలోనూ కరుణానిధి దేశంలో చాలా మందికి కొత్త దారులు చూపించారు. ఇవాళ్ల ఎన్నికల మ్యానిఫెస్టోలు విడుదల కాగానే మనకు వినిపించే ఫ్రీ గిఫ్టుల సంస్కృతి ఒక విధంగా ఆయనే పాప్యులర్ చేశారు. 1967లో మొదటిసారి సీఎం అయినప్పుడు చెన్నైలో మనుషులు లాగే రిక్షాలను ఆయన నిషేధించారు. వారికి సైకిల్ రిక్షాలను ఉచితంగా అందించారు. అలా మొదలైన ఆయన ఉచిత సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతూనే వచ్చింది. 1989లో ఉచిత విద్యుత్ కూడా ఆయనే మొదటిసారి అందించారు! ఇక 2006లో కరుణానిధి ఉచిత కలర్ టీవీలు అందిస్తామని ప్రకటించి సాటి రాజకీయ నేతలకి పెద్ద షాకే ఇచ్చారు!

 

 

కేవలం ఉచిత పథకాలే కాదు… పాలనలో అడుగడుగునా కరుణానిధి తన ముద్ర వేసే వారు. ఆయన వ్యక్తిగత జీవితంలో తాళికట్టమని పట్టుబట్టినందుకు ప్రేమను , ప్రేయసిని వదులుకున్నారు! ఎందుకంటే, ఆయన నాస్తికుడు కాబట్టి! కానీ, అదే కరుణానిధి ముఖ్యమంత్రిగా తమిళనాడులోని ఆలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు ఎంత ఖర్చు చేశారో తెలుసా? 420 కోట్లకు పైనే! తన వ్యక్తిగత నమ్మకాలు పాలనలో ప్రభావం చూపనీయలేదాయన! అలాగే, పార్టీపైన , తన కుటుంబంపైనా కూడా ఆయన ఏనాడూ నాస్తికత్వం రుద్దలేదు. ఆయన ఇంట్లో పూజలు జరిగిన ఫోటోలు మీడియాలో వస్తే కూడా కరుణ చలించలేదు. తన నమ్మకాలు, ఇంట్లోని వారు విశ్వాసాలు వేరు వేరంటూ కుండబద్దలు కొట్టారు!

మాధవ సేవని నమ్మని కరుణానిధి మానవ సేవని మాత్రం మనస్ఫూర్తిగా నమ్మేవారు! అందుకే, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించారు. స్వయంగా తన తల్లి పేర ట్రస్టు స్థాపించి పేదలకు సాయం అందిస్తూ వస్తున్నారు. తన తదనంతరం తాను మొట్ట మొదటిసారి చెన్నైలో కొన్న గోపాలపురం ఇల్లు కూడా హాస్పిటల్ గా మార్చాలని ఆయన కోరుకున్నారు! ఇంత కాలం కలైంగర్ నివాసంగా వున్న ఆ భవనం ఇక మీదట ఆసుపత్రి కాబోతోంది! ఇలా బోలెడు విభిన్న కోణాల సమ్మేళనమే… కరుణానిధి! అందుకే, ఆయన తన ప్రస్థానం దేవుడ్ని నమ్మని నాస్తికుడిగా మొదలు పెట్టి… చనిపోయే క్షణానికి… కొన్ని లక్షల మందికి ‘దేవుడు’ కాగలిగారు!