TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో మాజీ మంత్రి కారుమూరిని విచారించిన సిట్

Published on: Sat Apr 25, 2026 8:41PM

 

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు శనివారం సుదీర్ఘంగా విచారించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణలో ఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలు పాల్గొని, ఆయన స్టేట్మెంట్‌ను అధికారికంగా నమోదు చేశారు.

సిట్ ఎస్పీ వివరాల ప్రకారం, కారుమూరి నాగేశ్వరరావు వయసు 60 సంవత్సరాలకు పైబడినందున చట్టబద్ధ నిబంధనల ప్రకారం ఆయన కోరిన ప్రదేశంలోనే విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో ఆయన పూర్తి సహకారం అందించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.

ఈ కేసు ప్రధానంగా మద్యం రవాణా టెండర్లు, సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగినట్లు భావిస్తున్న అవకతవకలపై దృష్టి సారించింది. విచారణలో భాగంగా టెండర్ల జారీ విధానం, సబ్ కాంట్రాక్టుల ఎంపిక, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.అధికారుల అంచనాల ప్రకారం, ఈ అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ కారుమూరిపై కూడా కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సునీల్‌ను సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాలను చూపుతూ సునీల్ కొంత గడువు కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్పీ వెల్లడించారు.

మాజీ మంత్రి స్థాయి వ్యక్తిపై సిట్ విచారణ జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ దర్యాప్తు మరింత విస్తరించే అవకాశముందని, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.