స్పీకర్ కి అడ్డు పడుతున్నారా ? కర్ణాటకం మీద సుప్రీం ప్రశ్నలు

 

కర్ణాటక రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనపడడం లేదు. ఒకపక్క స్పీకర్ ఈ నెల 18న బలనిరూపణకి ఛాన్స్ ఇవ్వగా ఇప్పటికే సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఈ రోజు హియరింగ్ కి వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించకుండా స్పీకర్ ను ఎవరైనా అడ్డుకుంటున్నారా ? లేకపోతే ఈ విషయం ఎందుకు ఆలస్యం అవుతోందని సుప్రీం కోర్టు స్పీకర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది.  అయితే జులై 6 లేదా 8వ తేదీ రాజీనామాల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుని ఉంటే ఎమ్మెల్యేలు ఇక్కడి వరకు వచ్చే వాళ్లు కాదని గోగోయ్ అభిప్రాయ పడ్డారు.

 స్పీకర్ కు కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ ఎమ్మెల్యేలు చట్టబద్దంగా రాజీనామాలు చేశారని, వారి మీద ఎలాంటి ఒత్తిడి లేదని, ఆలస్యం చేయకుండా వారి రాజీనామాలు అంగీకరించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చెయ్యాలని రెబల్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరడం, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మంత్రులు కావడానికి అర్హులని ఆయన వాదించారు. అయితే స్పీకర్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని అన్నారు. 

రాజీనామాలు చేసిన 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారని, ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కాలేదని సింఘ్వీ న్యాయమూర్తికి చెప్పారు. రేపు రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించే విషయంలో, వారి అనర్హత విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుంటారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. కానీ ఇరు పక్షాల వాదన విన్న కోర్టు మద్యాహ్నానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.