కర్నూలు జిల్లాలో మీడియా ముసుగులో దందా
Published on: Tue Feb 28, 2012 3:14PM
ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి రూ.30 వేలు దండుకున్న నకిలీ విలేఖరి
హైదరాబా
ద్: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల విలేకరుల ముసుగులో కొందరు ఆగంతకులు కర్నూలు జిల్లాలో దందా నిర్వహిస్తున్నారు. మీడియాకు ఏజెంట్లుగా ఉంటూ కొందరు మీడియా సంస్థల నకిలీ గుర్తింపు కార్డులతో మరికొందరు బెదిరింపులకు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల నంద్యాలలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను రెండు దినపత్రికల క్రైమ్ రిపోర్టర్ నని చెప్పుకుంటున్న షబ్బీర్ అనే వ్యక్తి లక్ష రూపాయలు డిమాండ్ చేసి దొరికిపోయారు. గాంధీ చౌక్ లోని ఒక కర్మాగారం నుంచి కాలుష్యం వెలువడుతుందని బెదిరించి డబ్బు గుంజడానికి ప్రయత్నించారు. నంద్యాలలోని బొమ్మలసత్రం సెంటర్ లో వాహనదారులనుంచి మామూళ్ళను తీసుకుంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఓ నకిలీ విలేఖరి ఫోటోలు తీశాడు. తరువాత ఆ కానిస్టేబుల్ బెదిరించి రూ.30వేలు వసూలు చేశాడు. డబ్బులు పోగొట్టుకున్న ఆ కానిస్టేబుల్ తనను బెదిరించింది ఒక నకిలీ విలేఖరి అని తరువాత తెలుసుకుని ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. పాత్రికేయులు వృత్తిపరంగా వాహనాలపై రాసుకునే ప్రెస్ పదాన్ని కొందరు వ్యక్తులు ఆసరాగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఎస్ బి ఐ కాలనీలో ప్రెస్ అని వ్రాసుకున్న పల్సర్ బైక్ పై ఇద్దరు యువకులు వేగంగా వెళుతూ వివాహిత మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పోయారు.


