జాతీయ పతాకంలా..కర్ణాటకకు ప్రత్యేక జెండా.?

మనదేశంలో దేశానికి ప్రత్యేకంగా..రాష్ట్రాలకు ప్రత్యేకంగా జెండాలు ఉండవు..మనకి జెండా అంటే త్రివర్ణ పతాకమే. కానీ రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారం ఒక్క జమ్మూకశ్మీర్ మాత్రమే తమ రాష్ట్రానికి ప్రత్యేక పతాకాన్ని రూపొందించుకుంది. ఇప్పుడు కశ్మీర్ దారిలో మరో రాష్ట్రం ప్రత్యేకంగా జెండా రూపొందించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అదే కర్ణాటక. రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండాను రూపొందించుకునే విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇది సాధ్యమైతే డిజైన్లకు సంబంధించిన సలహాలు కూడా ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కన్నడిగుల ఖ్యాతిని తెలిపేలా రాష్ట్రానికి ఎరుపు, పసుపు రంగులతో కూడిన పతాకం ఉండాలని నాడు అసెంబ్లీలో ప్రతిపాదించారు. అయితే అలా ఉండటం ఏకత్వానికి, సమగ్రతకు విరుద్ధమని అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ దిశగా అడుగు ముందుకు వేసింది.