నన్ను చంపేస్తారా? : కర్ణాటక స్పీకర్ భావోద్వేగం !

 

గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన తన మీద కావాలనే బురద చల్లుతున్నారని కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్న ఆయన ప్రజాజీవితంలో అత్యంత పారదర్శకంగా ఉంటున్నానని అన్నారు. శాసనసభలో బలపరీక్ష తీర్మానం మీద కావాలనే జాప్యం చేస్తున్నానని కొందరు సభ్యులు చేస్తున్న ఆరోపణలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని ఆయన శాసనసభలో ఉద్వేగానికి లోనయ్యారు. 

తన నడివడిక మీద దారుణంగా బురద జల్లుతున్నారని చెబుతున్న సమయంలో ఆయన గొంతు బొంగురుపోయింది. తనకు తల్లిదండ్రులు గొప్ప సంస్కారం నేర్పారని, ఇలాంటి లక్ష ఆరోపణలు వచ్చినా మొక్కఓని ధైర్యంతో ముందుకే సాగుతానని అన్నారు. తాను నిప్పులపై కూర్చున్నానని పేర్కొన్న ఆయన తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నవారు కడుపుకు ఏం తింటున్నారో అని ప్రశ్నించారు. 

గౌరవ మర్యాదలతో బతుకుతున్న తనను నిందితుడిగా బోనులో నిలబెట్టి చంపేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. మహామహులు కూర్చున్న ఈ సభలో ఈరోజున ఇలాంటి దరిద్రం పట్టిందని అన్నారు. బేరసారాలపై సభలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం సిగ్గుపడే విషయమని రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అంశం రికార్డుల్లో ఉంటుందని భావి తరాలు వీటిని చూసి, మనల్ని అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభలో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది.