కీలక నేతలకు విజయాలు, అపజయాలు
Published on: Sat May 13, 2023 1:10PM
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక నేతల పాత్ర ప్రధానం. అయితే కీలక నేతలు కూడా ఓడిపోయారు. బిజేపీలో కూడా అదే పరిస్థితి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలువురు కీలక నేతలు విజయం సాధించగా... మరికొందరు ఊహించని విధంగా పరాజయం పాలవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురి నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు.
బళ్లారి రూరల్ స్థానం నుంచి బి.శ్రీరాములు ఓటమి పాలయ్యారు. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ ఓడిపోయారు. మరోవైపు రేపు ఉదయం బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. గెలుపొందిన అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.


