జల్లికట్టు స్పూర్తితో మరో ఉద్యమం..


జల్లికట్టుపై నిషేదం ఏత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఉద్యమం పలు ప్రాంతాల వారికి మాత్రం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇప్పటికే జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని యువత ముందుకొచ్చింది. ఇప్పుడు ఇదే ఉద్యమం స్ఫూర్తితో మరో ఉద్యమం మొదలైంది. ఈసారి ఉద్యమానికి తెర తీసింది కర్నాటక వాసులు. అసలు సంగతేంటంటే.. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు త‌ర‌హాలో క‌ర్నాట‌క‌లో కంబాలా ఆట‌ను సాంప్ర‌దాయంగా నిర్వ‌హిస్తున్నారు. కంబాలా ఆట‌ను దున్న‌పోతులతో నిర్వ‌హిస్తారు. అయితే 2014లో సుప్రీంకోర్టు జ‌ల్లిక‌ట్టుతో పాటు కంబాలా ఆట‌నుపైన కూడా నిషేధం విధించింది. దీంతో అక్కడ ఈఆటకు బ్రేక్ పడింది. ఇప్పుడు జల్లికట్టు ఉద్యమం స్పూర్తిగా వారు కూడా  కంబాల కోసం గళమెత్తుతున్నారు.

 

దీనిపై కేంద్రమంత్రి డి.వి.సదానందగౌడ మాట్లాడుతూ.. కంబాల క్రీడకు అనుమతి కోసం ప్రధాని మోదీతో చర్చిస్తానని... కంబాల క్రీడలో ఎలాంటి ప్రమాదాలూ, ప్రాణహాని ఉండదని అన్నారు. మరో కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. కంబాల క్రీడ కర్ణాటక ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ఎడ్ల పందేలపై త్వరలో ప్రధానితో చర్చలు జరుపుతానని తెలిపారు.