సభలో కాంగ్రెస్ ని తిట్టిన కుమారస్వామి....ఇవాళ కూడా ప్రభుత్వం గట్టెక్కినట్టే !

 

కన్నడ నాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగేలా కనపడడం లేదు. ఈరోజు సీఎం కుమారస్వామి అసెంబ్లీలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారాన్ని రేపింది. విశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన సీఎం సొంత సభ్యులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. తాను సీఎం అయిన నాటి నుంచి ముళ్లపైనే కూర్చున్నానని, ఆ ముళ్లన్నీ కాంగ్రెస్ పార్టీ వేసినవేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ కి ఏ కోశానా కనిపించడం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు కూడా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, కుమారస్వామి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో సభలో జేడీఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో పెను గందరగోళం ఏర్పడింది. బలపరీక్షపై స్పీకర్ రమేశ్ కుమార్ న్యాయసలహా తీసుకుంటున్నారు. మరోవైపు, విప్ జారీ అంశం స్పష్టత కోసం సుప్రీంకోర్టును కాంగ్రెస్ ఆశ్రయించింది. బీజేపీ మాత్రం నేడు బలపరీక్ష నిర్వహించాలని పట్టుబడుతోంది. 

సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 1.30గంటలలోపు మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్‌ డెడ్‌లైన్ విధించారు కానీ కర్ణాటక శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు బలం నిరూపించుకోవాలని సీఎం కుమారస్వామిని గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్ విధించిన గడువు ముగిసినా, ఓటింగ్ జరగలేదు. దీంతో గవర్నర్ సూచనను సీఎం కుమారస్వామి ధిక్కరించినట్టుయ్యింది. 

తనను ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉందా అని ప్రశ్నించిన సీఎం, రాజీనామా చేసిన ఎమ్మెల్యేల అంశంపై చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న బీజేపీ గవర్నర్‌కు అధికారాలున్నాయని పేర్కొంది. అయితే స్పీకర్ మాత్రం విశ్వాసతీర్మానంపై చర్చ కొనసాగుతుందని, అది ముగిసే వరకూ ఓటింగ్ నిర్వహించే ప్రసక్తేలేదని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. 

చర్చ జరగకుండా బలపరీక్ష జరపలేనని చెప్పిన ఆయన తనను సుప్రీంకోర్టు, గవర్నర్‌ శాసించలేరని స్పీకర్ ఉద్ఘాటించారు. ఈ సమయంలో స్పీకర్‌తో బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు.