కర్ణాటకలో బీజేపీ నెగ్గేస్తుందా!


 

ఇప్పుడు దేశం అంతా కర్ణాటక వైపే చూస్తోంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎన్ని మెలికలు తిరుగుతోందో గమనిస్తోంది. మోదీ ప్రచారం పుణ్యమా అని బీజేపీ 100 మార్కుల దాటేసింది. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 8 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీనికి తెలుగువారి ఓట్లే కారణం అన్న చర్చ లేకపోలేదు. అయినా బీజేపీ పెద్దలు ప్రజా తీర్పుని ఆమోదించే పరిస్థితుల్లో లేరు. ఎలాగైనా దక్షిణాదిన పాగా వేయాలనే పట్టుదలతో వారు సామదానబేధదండోపాయాలను అమ్ములపొదిలోంచి బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శిబిరం నుంచి జంప్‌ అయిపోయినట్లు వార్తలు వచ్చేశాయి. మరికొంతమంది తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు గాలిలాంటి దళారులు రంగంలోకి దిగారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే పక్షపాతిగా పేర్కొన్న బోపయ్యను స్పీకర్‌గా నియమించడం మరో ఎత్తు. బోపయ్య యడ్యూరప్పకు వీరవిధేయుడు. యడ్యూరప్పను కాపాడేందుకు ఉచ్చనీచాలను పెద్దగా పట్టించుకోనివాడు. ఇలాంటి దశలో ఎలాగొలా తమను బోపయ్య కాపాడేస్తాడనే నమ్మకంలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. అప్పటికప్పుడు ఏదో ఒక వంకతో కొందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి పరిస్థితులను తిరగతిప్పేయడంలో బోపయ్య సిద్ధహస్తుడు. కొందరు ఎమ్మెల్యేలు గట్టు దాటినా, కొందరు గైర్హాజరైనా ఆయన పని మరింత సులువైపోతుంది. ఇలాంటి వాతావరణం మధ్య ఇవాళ తలపెట్టే కర్ణటక బలపరీక్షలో బీజేపీనే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ తర్వాత మళ్లీ రచ్చ మొదలవ్వకా తప్పదు. సుప్రీం తలుపులు బాదకా తప్పదు! ప్రజాస్వామ్యానికి ఎన్ని కష్టాలో!