మళ్ళీ కర్ణాటక సీఎంగా యడ్డీ....కానీ నిలబడడం కష్టమే ?

 

గత కొద్దిరోజులుగా అనేక మలుపులు తిరుగుతూ కర్ణాటకతో పటు దేశం మొత్తాన్ని తీవ్ర ఉత్కంఠ రాజేసిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర పడింది ! నిన్న రాత్రి విశ్వాస పరీక్షలో పరాజయం పాలైన కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు నిన్నటితో కుప్పకూలింది. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో డివిజన్ పద్ధతిలో స్పీకర్ రమేశ్ కుమార్ ఓటింగ్ నిర్వహించారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామికి మద్దతుగా 99 ఓట్లు రాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. 

దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఓటింగ్ లో వీగిపోవడంతో ప్రభుత్వ సదుపాయాలను వదులుకొని ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనకు సూచించారు. 

మంచి ముహూర్తం చూసుకొని యడ్యూరప్ప సీఎం పదవిని అధిష్టించడమే ఇక తరువాయి. అయితే యడ్డీ ఆనందం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు మరోసారి ఇంత కాక రేపే అవకాశం లేకపోలేదు. ఎందుకనే విషయాన్ని విశ్లేషిస్తే కర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యే సీట్లు ఉండగా నిన్న విశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ సహా 204 మంది మాత్రమే హాజరయ్యారు. 

కాంగ్రెస్‌-జేడీయూ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇలా 20 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనలేదు. రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ఈ ఫ్లోర్ టెస్టు జరగడానికి ముందు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విప్ జారీ చేశారు. రూల్ ప్రకారం విప్ అమల్లో ఉండగా ప్రతి ఎమ్మెల్యే తమ పార్టీ సూచించిన వారికే ఓటెయ్యాలి, అంతేకాక అసెంబ్లీకి గైర్హాజరు కాకూడదు. 

కానీ కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు స్పీకర్ కేఆర్ రమేశ్ వీరిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరు అందరూ బీజేపీలో చేరే అవకాశాలు ఉండటంతో వీరి అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం. ప్రస్తుతం 105 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేల గైర్హాజరీతో ఇప్పటికైతే సభలో మెజార్టీ నిరూపించుకుంటుంది. కానీ సాధారణ మెజార్టీ రావాలంటే మాత్రం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. 

బీఎస్పీ, ఇండిపెండెంట్లకు ఈ అనర్హత వేట్లు పడే అవకాశం లేకపోవడంతో మరో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోవాలి. కానీ ఇప్పుడు జరిగిన ఈ అధికార అపహరణను ప్రజలందరూ చూశారు, సో ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన వారు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ, బీజేపీ ఈవీఎం మాయా జాలం చేస్తే తప్ప ! దీంతో సంకీర్ణ సర్కారుకు పట్టిన గతే యడ్యూరప్ప ప్రభుత్వానికి పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఓవైపు అండగా బీజేపీ పక్షపాత గవర్నర్, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు ఎలాగోలా పనిచేయచ్చు. చూడాలి మరి ఏమవుతుందో ?