పరిహారం చెల్లించనందుకు… రైలు ఇంజను జప్తు

ఎవరన్నా ప్రభుత్వానికి బాకీ పడితే వారి నుంచి అధికారులు ముక్కుపిండి మరీ రుణాన్ని వసూలు చేసుకుంటారు. కుదరని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారి ఆస్తులను జప్తు చేసుకుంటారు. కానీ ఏకంగా రైల్వే శాఖే ప్రజలకు బాకీని తీర్చకపోతే ఏం చేయాలి. అందుకనే కర్ణాటకలోని ఒక న్యాయస్థానం, రైల్వేవారి ఆస్తులైన రైలింజనును జప్తు చేసుకోవలసిందిగా ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకలోని చిత్రదుర్గ-రాయదుర్గల మధ్య రైల్వే లైనుని నిర్మించేందుకు రైల్వే శాఖ కొందరు రైతుల నుంచి భూమిని తీసుకుంది. అయితే ఇందుకోసం తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో 30 ఏళ్లుగా రైతులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేళకు గత నవంబరు నెలలో, కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చింది. వారికి వీలైనంత త్వరలో పరిహారాన్ని చెల్లించమని న్యాయస్థానం, రైల్వే శాఖను ఆదేశించింది. అయితే ఈ కోర్టు తీర్పుని కూడా రైల్వేవారు లెక్కచేయకపోవడంతో ‘హరిహర-చిత్రదుర్గ-బెంగళూరు’ మధ్య తిరిగే ప్యాసింజరు రైలుని జప్తు చేసుకోవల్సిందిగా కోర్టు ఆదేశించింది. అప్పుడు కానీ రైల్వే అధికారులు దిగారాలేదు. గత శుక్రవారం రైలు జప్తు కావడంతో ‘ఈసారి తప్పకుండా పరిహారాన్ని చెల్లిస్తాం. దయచేసి మా ఇంజనుని విడిచిపెట్టండి’ అంటూ కోర్టుని వేడుకున్నారు అధికారులు. కోర్టు దయతో తిరిగి ఇంజను కదిలింది! మరి ఈసారైనా రైతులకి పరిహారం లభిస్తుందో లేదో!