కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా....ఫ్లైట్ ఎక్కిన ఎమ్మెల్యే అరెస్ట్

 


కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉండగానే నిన్నరాత్రి బెంగళూరు ఎయిర్ పోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం ఉదయం 11గంటలకు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరుగనున్నట్లు సోమవారం కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న కాంగ్రెస్‌ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను అర్థరాత్రి ఐఎంఏ జ్యూవెల్స్ కుంభకోణం కేసులో SIT అదుపులోకి తీసుకుంది.  

పూణే వెళ్లడానికి సిద్ధమై ఫ్లైట్ ఎక్కిన రోషన్‌ బేగ్‌ను సిట్‌ అధికారులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమని, గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కుమార స్వామి ఆరోపించారు.

ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్‌ సైతం సంఘటనా స్థలంలో ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. నిజానికి ఆయన నిన్న అధికారుల ముందు విచారణకు హాజరుకావలసి ఉంది. కానీ తాను హజ్ యాత్రకు వెళ్లడానికి సిద్దం అవుతున్నానని, ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని పీఏతో SIT అధికారులకు సమాచారం పంపించారు. అలా చెప్పిన వ్యక్తి సడన్ గా విమానాశ్రయానికి వెళ్లి మాయం కావడానికి ప్రయత్నించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.