కర్ణాటక సీఎం యడ్యూరప్ప అవుట్?
Published on: Fri Jun 11, 2021 9:50AM
ప్రజాగ్రహంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న కమలం అధిష్టానం.. తమ పార్టీ ముఖ్యమంత్రులను కూడా మార్చబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకకు సంబంధించి కీలక పరిణామాలు జరగబోతున్నాయని కొంత కాలంగా చర్చ జరుగుతోంది. పార్టీ ప్రక్షాళనలో భాగంగా మొదటగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు గండం ఖాయమని అంటున్నారు. ముఖ్యమంత్రిగా యడియూరప్పను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్న క్రణాటక నేతల ఒత్తిడికి అధిష్ఠానం తలొగ్గినట్టు తెలుస్తోంది. వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని యడ్డీని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించాయి.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అరుణ్‌సింగ్ ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన బెంగళూరుకు రానుండడం ఇందుకు బలాన్నిస్తోంది. నాయకత్వ మార్పునకు కసరత్తు కోసమే అరుణ్ సింగ్ వస్తున్నారనే వార్తలొస్తున్నాయి.నాయకత్వ మార్పుపై పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని అరుణ్ సింగ్ సూచించారు. అయితే నాయకత్వ మార్పులపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేస్తున్నారు. గురువారం ఢిల్లీలో మాట్లాడిన అరుణ్‌సింగ్.. యడ్డీపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉత్తమంగా పాలిస్తున్నారని ప్రశంసించారు. సీఎం పనితీరుపై బీజేపీ అధినాయకత్వం సంతృప్తిగా ఉందని, నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను కలిసి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
యడ్యూరప్ప కర్ణాటక లో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి. ఇప్పటికి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. మూడుసార్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఎనిమిది సార్లుగా ఓటమి లేకుండా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం బీజేపీ ఎమ్మెల్యేకు నచ్చలేదు. దీంతో కొందరు సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.దాదాపు 4 0మంది ఎమ్మెల్యేలు సీఎం యడ్యూరప్పకు వ్యతిరేకంగా కూటమి కట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి కూడా వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం బళ్లారిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి దాదాపు నాలుగు వేల ఎకరాల భూమిని కేటాయించింది. అది మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలకు రుచించలేదు. జనతాదళ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. అదే బీజేపీ ఇప్పుడు పవర్ లోకి రాగానే ఈ భూ పందారం చేయడాన్ని కొందరు శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తూ సీఎంకు నేరుగానే లేఖ రాశారు. ఇది బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని వారంతా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా యడ్యూరప్ప స్పందించలేదు.ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తి మరికొందరిలో ఉంది. ఈ కోవకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు నలభై మంది వరకు ఉన్నారని తెలుస్తోంది.


