తుది అంకానికి కర్-నాటకం...రాజీనామానా...అసెంబ్లీ రద్దా ?

 

గత కొన్ని రోజులుగా ఉత్కంఠను రేపిన కర్ణాటక రాజకీయం చివరి అంకానికి చేరినట్టే ? నా అంటే అవుననే అంటున్నారు. ఏడాది క్రితం అట్టహాసంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని, రెబెల్ ఎమ్మెల్యేలను సముదాయించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు 11 గంటలకు కుమారస్వామి అత్యవసరంగా మంత్రిర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 

కేబినెట్ మీటింగ్ తర్వాత గవర్నర్ ను కలిసి కుమారస్వామి రాజీనామా పత్రాన్ని అందిస్తారని సమాచారం. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. నిన్న ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ కారులో బయటకు వెళ్లిన కుమారస్వామి కొన్ని గంటల పాటు పత్తా లేకుండా పోయారు. ఆ తర్వాత జేపీ నగర్‌ లోని తన సొంతింటికి వెళ్లి రాజకీయ పరిణామాలపై తన తండ్రి దేవెగౌడతో చర్చించారు. ఆయనతో చర్చలు జరిపాక ఆయన సలహా మేరకే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వస్తే బయట నుంచి మద్దతు ఇద్దామని దేవెగౌడ చేసిన ప్రతిపాదనను కుమారస్వామి అంగీకరించారని అంటున్నారు. అయితే కుమారస్వామి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు పూనుకుంటే తద్వారా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా అసెంబ్లీని రద్దు చేయవద్దని కోరుతోంది. కుమారస్వామి రాజీనామా చేస్తే మళ్ళీ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ సర్కార్‌తో ఏర్పాటయ్యే అవకాశాలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. రెబల్ ఎమెల్యేలందరికీ మంత్రి పదవులిస్తే వారు రాజీనామాలను ఉపసంహరించుకుంటారని, తద్వారా తగిన బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?