అర్ధరాత్రి హైడ్రామా.....ఏమీ తేలని కర్ణాటకం....ఈరోజైనా ?

 

కర్నాటక సంక్షోభం ఇంకా ముగియలేదు. మూడు రోజుల క్రితం మొదలయిన బలపరీక్ష హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రిలోపు ఈ తంతు పూర్తి అవుతుందని భావించగా అర్థరాత్రి వరకు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదాలతోనే సరిపోయింది. బలపరీక్షను వాయిదా వేయాల్సిందేనని అధికారపక్షం, ఎట్టి పరిస్థితుల్లోనూ జరపాల్సిందేనని బీజేపీ పట్టు బట్టాయి. దాదాపు అర్ధరాత్రి వరకు వేచి చూసిన సభాపతి సభ కంట్రోల్ లోకి రాకపోవడం, పలువురు ఎమ్మెల్యేలు షుగర్ పేషెంట్ లు కావడం, ఆకలి హాహాకారాలు మొదలయిన నేపథ్యంలో సభను నేటికి వాయిదా వేశారు. 

ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు సభలో విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ నిర్వహించాలని ర్ణయించారు. అధికార,ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేశాయి. నిన్న ఉదయం సభ ప్రారంభం అయిన నాటి నుండి సభలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ సభ్యులు సుదీర్ఘంగా ప్రసంగించారు. విశ్వాస తీర్మానంపై చర్చను అప్పుడే ముగించరాదని ఇంకా 15 మంది అధికార పక్ష సభ్యులు, ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడాల్సి ఉందని సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య సభలో పట్టుబట్టారు. ఇద్దరు స్వతంత్ర సభ్యుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడేదాకా ఓటింగ్‌ జరపరాదన్నారు. 

అలాగే మరో రెండు రోజులు చర్చించాలని స్పీకర్‌ ను సీఎం కుమారస్వామి కోరారు. సీఎం తీరుపై స్పీకర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంత రాత్రయినా నిన్ననే బలపరీక్ష ఓటింగ్‌ను ముగిస్తానని, సభను వాయిదా వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.  వారి సభను అడ్డుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో వారి నీడ సభాపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటింగ్‌ను కావాలనే ఆలస్యం చేస్తున్నారని, ఇలాగైతే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. 

దీంతో సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి సభను నేటికి వాయిదా వేశారు. ఇక ఈరోజు పార్టీ విప్​ను అనుసరించి ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి హాజరుకావాలని స్పీకర్​ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు అసమ్మతి ఎమ్మెల్యేలు రాకుంటే నర్హత వేటు వేస్తానని స్పీకర్‌ ప్రకటించిన నేపథ్యంలో రెబ ల్స్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  ఇవాళైనా కర్నాటక సంక్షోభానికి ఎండ్ కార్డు పడుతుందా? లేదా నాలుగో రోజు కూడా కర్నాటక నాటకాన్ని కొనసాగిస్తారా అన్నది ఈ పైవాడికే ఎరుక.