కర్నాటక అసెంబ్లీలో మంత్రులు అశ్లీల చిత్రాల వీక్షణ
Published on: Wed Feb 8, 2012 8:44AM
బెం
గుళూరు: కర్నాటక శాసనసభలో మంత్రులై ఉండి, సభలో తీవ్రమైన చర్చ జరుగుతున్నా పట్టించుకోకుండా కామాంధులుగా వ్యవహరించిన ఘనత బిజెపి నేతలకే దక్కుతుంది. మంగళవారం శాసనసభలో అశ్లీల చిత్రాలను వీక్షిస్తూ ఇద్దరు మంత్రులు కెమెరా కళ్లకు దొరికి పోయారు. పురుషులు, స్త్రీలు మధ్య స్నేహమే తప్పని నీతులు చెబుతూ సోషల్ పోలీసింగ్ పేరుతో యువతీ యువకులపై దాడులు జరిపిన బిజెపి పరివారానికి చట్టసభలో ఉన్నామనే సోయి కూడా లేకుండా పోయింది. బిజాపూర్ జిల్లాలో పాకిస్తాన్ జాతీయ జెండా ఆవిష్కరణ, తదనంతరం ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం శాసనసభలో చర్చ చోటుచేసుకుంది. ఈ సమయంలో సభలోనే ఉన్న మంత్రులు లక్ష్మన్ సావడి, సిసి పాటిల్ చర్చను పట్టించుకోకుండా తమ సెల్‌ఫోన్‌లో ఆశ్లీల చిత్రాలు చూస్తున్న దృశ్యం సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌లో ప్రసారం అయ్యాయి. తమ మంత్రులు అడ్డంగా దొరికిపోవడంతో ఏమి చెప్పాలో తెలియక బిజెపి నేతలు దీనిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే స్పీకర్ బోపయ్య మాత్రం మంత్రుల చర్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సౌదీ అరేబియాలో ఓ మహిళపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన వార్తను వారు తమ సెల్‌పోన్‌లో వీక్షించారని ఆయన పేర్కొంటున్నారు. కాగా ఈ అంశంపై సంబంధిత మంత్రులను సంప్రదించేందుకు మీడియా విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజని మాజీ సిఎం, జెడిఎస్ నేత హెచ్‌డి కుమారస్వామి విమర్శించారు. ఇప్పటికే అక్రమ మైనింగ్, లోకాయుక్త తదితర సమస్యల్లో ఇరుక్కున్న బిజెపికి ఇది మరో దెబ్బ.


