TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ్యువెలరీ షాప్‌లో కాల్పులు...దోపిడీ

Published on: Sun May 3, 2026 2:02PM

 

కరీంనగర్‌లో పట్టపగలే గన్‌తో దోపిడీ...

నగరాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఘటన..

కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ ఆభరణాల దుకాణం పీఎంజే జ్యువెలరీ షాపుపై ఐదుగురు సాయుధ దుండగులు దాడి చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. పట్టపగలే, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారి తీసింది.

ఈరోజు మధ్యాహ్నం కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఐదుగురు వ్యక్తులు తుపాకులతో షాప్‌లోకి చొరబడ్డారు. ముందుగా సిబ్బందిని బెదిరిస్తూ గాల్లో కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం సిబ్బందిని ఒక మూలకు తరలించి, షోరూమ్‌లో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం ఘటన కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాల్పుల శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పుల సమయంలో ఎవరైనా గాయపడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా అప్రమత్త చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వ్యాపార వర్గాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరుతున్నాయి. ఈ కేసులో త్వరలోనే కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.