రాజకీయ అరంగేట్రంపై కరీనా కపూర్‌ కీలక ప్రకటన

 

ప్రముఖ బాలీ వుడ్ నటి కరీనా కపూర్‌ రాజకీయ అరంగేట్రంపై కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి కరీనాను బరిలో దించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కరీనా స్పందించారు. తన పొలిటికల్‌ ఎంట్రీపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని ప్రకటించారు. తనను ఇంతవరకు ఏ పార్టీ సంప్రదించలేదని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదే ఉన్నట్టుగా వెల్లడించారు.

మరోవైపు భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.. దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ లు ఆ పార్టీ అధిష్ఠానానికి సూచించారు.  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రమే కాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కోడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని గుడ్డు చౌహన్‌ విశ్వసిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తాత ఒకప్పుడు భోపాల్‌ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్‌ తరఫున భోపాల్‌ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని గుడ్డు చౌహాన్‌ అధిష్టానానికి తెలిపారు. ఈ నేపథ్యంలో గుడ్డు చౌహాన్‌ ప్రయత్నాలకు కరీనా అడ్డుకట్ట వేశారు.