సున్నపురాయి, మాంగనీస్ పై ఖద్దరు డేగల కన్ను
Published on: Fri Feb 24, 2012 1:29PM
కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో ఎంతో విలువైన సున్నపురాయి, మాంగనీసు నిల్వలపై రాజకీయ నాయకుల డేగకళ్ళు పడ్డాయి. వందలాది కోట్ల విలువ చేసే ఈ గనులను హస్తగతం చేసుకోవడానికి అనేక బినామీ కంపెనీలను సృష్టించారు. ఆ కంపెనీలకు ఈ గనులను కట్టబెట్టాలంటూ ఒత్తిళ్లు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి పట్టణానికి సమీపంలో వున్న ఆకుసాయిగూడెం, నేరెళ్ళగుట్ట ప్రాంతంలో అపారంగా సున్నపురాయి, మాంగనీసు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వందలాది గిరిజన గూడాలు కూడా ఉన్నాయి. ఈ గనులను తొలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రాజకీయ నాయకులు గిరిజనులను నిర్వాసితులను చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. తాము అనేక దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని, తమ భూమిని గనుల యజమానులకు ధారాదత్తం చేయవద్దని గిరిజనులు కోరుకుంటున్నారు. వీరి విన్నపాలు కరకు రాజకీయ గుండెలను కరిగించలేక పోతున్నాయి. ఎలాగొలా ఈ గనులను స్వాధీనం చేసుకోవడానికి వారు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.


