టీడీపీకి 'కాపు' కాయకుండా హ్యాండ్ ఇస్తారా ?

ఏపీలో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి నిముషానికి ఒక్కో అప్డేట్ వస్తూ రకరకాలగా టెన్షన్ పెడుతున్నాయి. ఇక తాజాగా విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు వెంటనే సమీక్షలు మొదలు పెట్టారు. తాజా రాజకీయపరిణామాల మీద అందుబాటులో ఉన్న నేతలతో చర్చిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలోప్రజావేదిక కూల్చివేత, ఎంపీలు బీజేపీలో చేరడంతో పాటూ పలు కీలక అంశాలపై నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా చంద్రబాబు నివాసం మార్పు విషయం మీద చర్చ జరిగిందట. తాను నివాసం ఉంటున్న భవనం కూడా కూల్చివేత వరకూ వస్తుందని దీంతో ఏమి చేయాలనే అంశంపై నేతలతో చర్చించారట. అయితే ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు అందరూ డుమ్మా కొట్టారు. అయితే నిజానికి చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం ఏర్పాటు చేసినా పొరుగునే విజయవాడలో నివాసం ఉండే కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ భేటీకి దూరంగా ఉన్నారు. నిజానికి మామూలుగా ఇప్పుడు రాకుండా ఉండి ఉంటే పెద్దగా ఏమీ అనిపించి ఉండేది కాదేమో కానీ బాబు విదేశీ పర్యటనకు వెళ్తే అదే సమయంలో కాకినాడలో టీడీపీ కాపు నేతలు సమావేశం కావడం, అదే రోజు నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంతో ఈ కాపు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ జరిగింది. కానీ తాము పార్టీ మారేది లేదని నేతలు బొండా ఉమా క్లారిటీ ఇచ్చారు. కానీ నిన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న సమయంలో కూడా కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, గద్దే రామ్మోహన్, దేవినేని అవినాష్, బచ్చుల అర్జునుడు లాంటి వాళ్ళు వెళ్లారు. కానీ బోండా ఉమా మాత్రం అక్కడ కనిపించ లేదు. దీంతో ఆరోజు కాపు భేటీలో ఉన్న వారంతా పార్టీ మారతారు అనే ప్రచారం ఊపందుకుంది.