TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాపు కాసేందుకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్‌ నేతలు

Published on: Fri Mar 17, 2017 6:13PM

ఆంధ్రప్రదేశ్‌‌లో కాపు ఫోబియా పట్టుకుంది. అన్ని పార్టీలూ కాపుల వైపే చూస్తున్నాయి. గత ఎన్నికల్లో కాపుల ఓట్లతోనే తెలుగుదేశం అధికారంలోకి రాగలిగిందని అంటారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... చంద్రబాబుకి మద్దతు ఇవ్వడంతో కాపులు ఏకపక్షంగా టీడీపీకి ఓట్లేశారనేది ఒక అంచనా. అందుకే సంక్షేమ పథకాలు, కార్పొరేషన్‌ ఏర్పాటుతో కాపులను అధికార టీడీపీ మరింత మచ్చిక చేసుకుంటుంటే... ప్రతిపక్ష వైసీపీ మాత్రం కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి అండగా ఉంటూ బీసీల్లో చేర్చేవరకూ అండగా ఉంటామంటోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఏపీలో ఉనికి కోల్పోతున్న పార్టీని కాపాడుకునేందుకు కాపుల వైపు చూస్తోంది. వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌‌కు కాపు కాసిన కాపులను మళ్లీ తమవైపు తిప్పుకుంటేనే పార్టీ ఏపీలో బతికి బట్టకడుతుందని భావిస్తోన్న పెద్దలు..... కాపులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా కాపుల ఓట్లే కీలకంగా మారడంతో ఆ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాపులకు చేరువయ్యే మార్గాలను అన్వేషించిన ఏపీ కాంగ్రెస్‌.... కాపు రిజర్వేషన్ల అంశంపైనే దృష్టిపెట్టింది. కాపుల సమస్యలను అందిపుచ్చుకుని పోరాటం చేయడం ద్వారా వాళ్లకు దగ్గర కావాలని భావిస్తోంది.

 

టీడీపీ, వైసీపీలో కాపు లీడర్లకు పెద్దపీట వేస్తుండటంతో... కాంగ్రెస్‌ కూడా ఆ దిశగా ఆలోచిస్తోంది. కాపులను ఆకట్టుకునే క్రమంలో కాపులకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. చిరంజీవి లేదా పల్లంరాజుకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లే కీలకం కావడంతో ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇప్పట్నుంచే కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మరి కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో లేదో చూడాలి.