TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ కు సీన్ రివర్స్ అయినట్టుంది..!

Published on: Tue Feb 9, 2016 11:09AM

ముద్రగడ పద్మనాభం కాపుల కోసం చేపట్టిన దీక్ష ఫలించిందనే చెప్పొచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నివేదిక రావడం..వారిని బీసీల్లో చేర్చడం.. రిజర్వేషన్లు కల్పించడం.. వీటన్నింటికి ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం ముద్రగడ డిమాండ్ లకు సానుకూలంగా స్పందించింది..దీంతో ముద్రగడ కూడా తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమించాడు. అయితే ఇక్కడ వరకూ పరిస్థితి బానే ఉంది.

దీనివల్ల ఇప్పుడు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఈ కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో అటు దీక్ష చేపట్టిన ముద్రగడ బానే ఉన్నాడు.. తన డిమాండ్ లకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం బానే ఉంది.. కానీ ఈ ఉద్యమం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై మాత్రం కాపులలో వ్యతిరేకత ఏర్పడింది. ముద్రగడ ఏర్పాటు చేసిన మహా గర్జన ఉద్రిక్తంగా మారిందనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆందోళనకారులు రైలును కూడా తగలబెట్టారు. దీంతో ఇది చాలా వివాదాస్పదమైంది. ఈ సంఘటన గురించి పలువురు పలు రకాలుగా కూడా వ్యాఖ్యానించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి తనకు తోచింది చెప్పారు. అయితే అక్కడే పవన్ కళ్యాణ్ పప్పులో కాలేశారు. రైలు తగలబెట్టడం అసాంఘీక శక్తుల చర్య అయి ఉండొచ్చని.. తను ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదని తానొవ్వక.. నొప్పించక అనే రీతిలో మాట్లాడాడు. దీంతో కాపు వర్గం పవన్ కళ్యాణ్ పై మండి పడుతుంది. కాపు వర్గానికి సపోర్డ్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకు ఆయనపై నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మని దగ్ధం చేయటానికి ప్లాన్ చేసుకున్నారు.

ఇక వెంటనే తేరుకున్న పవన్ కళ్యాణ్ మొదటికే మోసం వస్తుందనుకున్నారేమో.. కాపులను గుర్తించాలంటూ తను ట్విట్టర్ నుండి మద్దతు ప్రకటించాడు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని.. కాపుల డిమాండ్‌ను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీని పవన్ కోరారు. అయితే దీనికి కూడా వారు పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లో మద్దతు తెలపడం కాదు.. బయటకు వచ్చి పోరాడు అని అంటున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.