TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్యాయం జరిగింది కాపులకా? కమ్మవారికా?

Published on: Wed May 9, 2012 9:53AM

గుంటూరు జిల్లాలో కాపు, కమ్మవారు బలమైన సామాజికవర్గాలుగా ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టిడిపిల్లో వీరిదే హవా. అయితే ప్రస్తుతం ఈ రెండు సామాజికవర్గాలు ఆయా పార్టీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. తమ తమ సామాజికవర్గాలను రెండు పార్టీలూ అణిచివేస్తున్నాయని ఆయా వర్గాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో తమ వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన అంటున్నారు. దీన్ని అధిష్టానం గుర్తించకపొతే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే 18 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క తిరుపతి సీటు మాత్రమే కమ్మసామాజిక వర్గానికి చెందిన మంత్రి గల్లా అరుణకుమారి తనయుడైన జయదేవ్ కు ఇవ్వమని అడిగామని, దానికి కూడా అధిష్టానం అంగీకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్మ సామాజికవర్గాన్ని అణచివేయడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.

 

మరోవైపు గుంటూరు జిల్లాలో కాపులు కూడా రాజకీయంగా తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. కాపులను దేశం అధినేత చంద్రబాబు నాయుడు కరివేపాకుల్లా వాడుకుని వదిలేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శనక్కాయల అరుణ, సాంబశివ రావు తదితరులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ తమ సామాజిక వర్గానికి గుర్తింపు కొరవడిందని వారు చంద్రబాబు నాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. గుంటూరు జిల్లా వరకూ కాపులకు కొంత అన్యాయం జరిగిన మాట నిజమేనని చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యక్తం చేస్తున్న అసంతృప్తిలో న్యాయం లేదని చంద్రబాబునాయుడు అన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఆయనకు ఎప్పుడూ మంచి గుర్తింపునే ఇచ్చామని, పలు పదవులను కూడా వెంకటేశ్వర్లు అనుభవించారని ఆయన అంటూ జీవితాంతం ఒక్కరే పదవులు అనుభవించాలంటే ఎలా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.