కపిల్ దేవ్‌ కు గుండెపోటు

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. 61 ఏళ్ల కపిల్‌ దేవ్‌ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కపిల్‌ దేవ్‌ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కపిల్ దేవ్‌ కు గుండెపోటు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్ ఆరోగ్యంపై పలువురు క్రికెటర్లు, ప్రముఖులు స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

 

కాగా, భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన కపిల్‌దేవ్‌ 1983లో వరల్డ్ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 225 వన్డేలు, 131 టెస్టులు ఆడిన కపిల్‌ దేవ్‌.. 9000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌ గా రికార్డు సాధించారు.