విఐపిల సేవలో తరిస్తున్న బాపిరాజు దంపతులు
Published on: Thu Mar 8, 2012 11:03AM
తిరు
పతి: టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆయన భార్య తిరుమలలో మకాంవేసి విఐపిల సేవలో తరిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. టిటిడి బోర్డు ఛైర్మన్ పదవిని పొందిన తరువాత కనుమూరి బాపిరాజు ఎక్కువ సమయం తిరుమలలోనే కేటాయిస్తున్నారు. ఆయనకు ఆయన భార్య చేదోడు వాదోడుగా ఉంటూ విఐపిలకు సపర్యలు చేస్తున్నారు. తిరుమలకు ఏ విఐపి వచ్చినా లేదా ఏ సెలబ్రిటి వచ్చినా వారిని స్వయంగా దగ్గరుండి వీరిరువురు శ్రీవారి దర్సనానికి తీసుకెళుతున్నారు. ఈ ఉత్సాహంలో వారు నిబంధనలు సైతం కాలరాస్తున్నారు. తాజాగా సినీనటి సుమలత, అంబరీష్ లను కూడా కనుమూరి బాపిరాజు భార్య మహాద్వారంలోంచి నేరుగా శ్రీవారి దర్శనానికి తీసుకెళ్ళారు. నిజానికి ఇది దేవాలయ ప్రోటోకాల్ నిబంధనలకు పూర్తిగా విరుద్దం. టిటిడి ఛైర్మన్ గా శ్రీవారిసేవలో తరించవలసిన వీరు విఐపి సేవలకు ఆసక్తి ఎందుకు చూపుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. తిరుమల వచ్చే విఐపిలకు సేవలుచేసి వారిని ప్రసన్నం చేసుకుంటే భవిష్యత్తులో వారి వల్ల తమకేదయినా ఉపయోగం ఉంటుందేమోనన్న దూరదృష్టితోనే బాపిరాజు దంపతులు ఇలా చేస్తున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.


