ధన్యజీవి కంఠంనేని నాగేంద్రమ్మ కన్నుమూత

 

కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో దొడ్డ ఇల్లాలిగా కీర్తి ప్రతిష్ఠలున్న ధన్యజీవి శ్రీమతి కంఠంనేని నాగేంద్రమ్మ కన్నుమూశారు. వయసు మీదపడటం వల్ల కలిగిన అనారోగ్యం కారణంగా ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. సంతృప్తి నిండిన సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించిన ఆమె 83 సంవత్సరాల పండు వయసులో తమ స్వగ్రామమైన దివిసీమలోని రావివారిపాలెంలో ప్రశాంతంగా కన్నుమూశారు. శ్రీమతి కంఠంనేని నాగేంద్రమ్మ భర్త కంఠంనేని వెంకటేశ్వరరావు గత సంవత్సరం దివంగతులయ్యారు. దివిసీమ ప్రాంతంలో కంఠంనేని వంశానికి వున్న పేరు ప్రతిష్టలను ఈ పుణ్య దంపతులు ఇనుమడింపజేశారు. ఈ దంపతులు సమాజంలో వున్న నలుగురికీ ఉపయోగపడుతూ ధన్యజీవులుగా పరిపూర్ణ జీవితాన్ని గడిపారు.

 

శ్రీమతి నాగేంద్రమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కంఠంనేని శివశంకర్. ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, తెలుగువన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన కంఠంనేని రవిశంకర్ శ్రీమతి నాగేంద్రమ్మ ద్వితీయ కుమారుడు. శివపార్వతి, శివరాణి అనే ఇద్దరు కుమార్తెలు కూడా శ్రీమతి నాగేంద్రమ్మకు వున్నారు. కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మనవరాళ్ళతో వర్ధిల్లుతున్న కంఠంనేని కుటుంబం శ్రీమతి నాగేంద్రమ్మ కన్నుమూతతో పెద్ద దిక్కును కోల్పోయింది. మాతృమూర్తి మరణంతో పుట్టెడు దు:ఖంలో వున్న కంఠంనేని శివశంకర్, కంఠంనేని రవిశంకర్, ఇతర కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు అభిమానులు సానుభూతిని తెలిపారు. శ్రీమతి కంఠంనేని నాగేంద్రమ్మ దివ్యాత్మకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.