కొంపముంచిన జగన్ నిర్ణయం.. కర్ణాటకలో మొదలైన లొల్లి!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న.. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అనే సంచలన నిర్ణయం.. ఇతర రాష్ట్రాల్లో  పెద్ద చిచ్చు పెట్టి.. చివరికి ఏపీ యువతకే పెద్ద శాపంగా మారనుందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికులకే ఉద్యోగాలు అని జగన్ తీసుకున్న నిర్ణయంతో.. కర్ణాటక రాష్ట్రం కూడా ఇదే పాట అందుకుందట. జగన్ నిర్ణయం తీసుకున్న సమయంలోనే ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తాయి. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే.. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే ఏపీ ప్రజల పరిస్థితి ఏంటని.. టీడీపీ నేత కేశినేని నాని వంటివారు ప్రశ్నించారు.

అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కేశినేని నాని చెప్పిందే జరిగేలా కనిపిస్తోంది. కర్ణాటక ఉద్యోగాలు కన్నడిగులకే చెందాలని అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయట. ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర కూడా ఆగష్టు 14,15 తేదీల్లో జరగబోయే ఉద్యమానికి మద్దతుగా దీక్షలో కూర్చోనున్నారని కూడా తెలుస్తోంది. ఈ ఉద్యమానికి కర్ణాటక ప్రభుత్వం మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు తలలు పట్టుకుంటున్నారట. కర్ణాటక కూడా ఏపీ మాదిరిగానే స్థానికులకు ఉద్యోగాలు అని నిర్ణయం తీసుకుంటే.. కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్న తమ పరిస్థితి ఏంటని తెలుగు యువత సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మేం ఏపీకి వచ్చి గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవాలని మండిపడుతున్నారు. మరి సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి.