అరాచకం సృష్టిస్తున్నా జగన్ మాట్లాడరా ?

 

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా తానే మారతామని చెప్పిన ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మి నారాయణ ఆ మేరకి విమర్శల దాడి ప్రారంబించారు. జగన్‌ పాలన మొత్తం అవినీతి మయం అయిందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టేశారని విమర్శించారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆ పార్టీ నేతలు భూ కబ్జాదారులుగా మారారని ఆరోపించారు కన్నా. కబ్జాలను అడ్డుకుంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. 

గత ప్రభుత్వం ఇదే తరహాలో ప్రవర్తించి ప్రజాగ్రహానికి గురైందని, ఇప్పుడదే బాటలో వైసీపీ ప్రభుత్వం కూడా నడుస్తోందని కన్నా విమర్శించారు. గ్రామాల్లో పోలీసులు రాజ్యం ఏలుతున్నారని, వైసీపీ శ్రేణులు గ్రామస్థాయిలో ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని కన్నా పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తుంటే ఇప్పటివరకు వైసీపీ అధినేత సీఎం జగన్ మాట్లాడటం లేదని ఆయన ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో రెండు మూడు గ్రామాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డ సమయంలో కూడా ఘాటుగానే స్పదించిన కన్నా ఇప్పుడు ఈ దాడుల విషయాన్నే హైలైట్ చేసి జగన్ సర్కార్ ని టార్గెట్ చేసేట్టు కనిపిస్తున్నారు.