మోదీకి వ్యతిరేకంగా అరాచకశక్తులు.. అమిత్ షాపై దాడి

 

పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన దాడిని నిరసిస్తూ.. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులకు కారకులైనవారిని ఏపీ సీఎం చంద్రబాబు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజాస్వామ్య పరిరక్షణ అని పేరు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు, ఉగ్రవాదులు అందరూ ఏకమై అమిత్ షాపై దాడిచేశారన్నారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న దొంగలు, అరాచకశక్తులు ఏకం అవుతున్నాయని కన్నా విమర్శించారు. భారత్ కు అవినీతి చేసేవాళ్లు కావాలా? అరాచక శక్తులు కావాలా? లేక అభివృద్ధి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ అరాచక శక్తులు పశ్చిమబెంగాల్ కేంద్రంగా హింసను రాజేస్తున్నాయని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.