బాబు చేసిన తప్పులే చేస్తున్న జగన్!!

 

పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని కేంద్రం నుంచి విపక్ష నేతల దాకా దాదాపు అందరూ చెప్పారు. అయినా జగన్ వెనుకడుగు వేయనన్నారు. దీంతో ఆయన మీద విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించడంతో ఆయన మీద విమర్శల దాడి మొదలైంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ సర్కార్ మీద విరుచుకుపడ్డారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా జగన్ మీద విమర్శలు గుప్పించారు.

కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. రీటెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. తాజాగా కోర్టు ఆదేశాలతో  ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పుల్నే ఇప్పుడు జగన్ చేస్తున్నారని కన్నా విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని మొదట్నుంచీ చెబుతున్నామని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. వారు చేసిన తప్పును ధైర్యంగా చెప్పలేక.. కేంద్రంపై నెట్టడం సరికాదని హితవు పలికారు. కనీసం పోలవరం అథారిటీ దృష్టికి కూడా జగన్‌ ఏ విషయాలూ తీసుకెళ్లలేదని కన్నా విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కన్నా అభిప్రాయపడ్డారు.