TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాణిపాకంలో రథచక్రాలు దగ్ధం.. ఇది ట్రయల్ వెర్షనేనా?

Published on: Mon Jan 31, 2022 2:55PM

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక  స్వామి ఆలయానికి చెందిన రథ చక్రాలను దుండగులు దగ్ధం చేశారు. ఈ పని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్న వివరాలేవీ ఇంకా తెలియరాలేదు. అయితే రథ చక్రాలు దగ్ధమైన విషయాన్ని మాత్రం ఆలయ అధికారులు లైట్ తీసుకోవడమే విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక భక్తులు. కాణిపాకం ప్రధాన ఆలయ సమీపంలోని గోడౌన్లో తుక్కు కింద ఉన్న స్వామివారి రథ చక్రాలను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. అయితే ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడానికి కారణం.. ఆ రథ చక్రాలు కొన్నేళ్లుగా స్క్రాప్ కింద పడి ఉండడమేనని అంటున్నారు. 

అయితే గోడౌన్లో ఉన్న వస్తువేదైనా, అది తుక్కే అయినప్పటికీ దుండగులు రావడం, వస్తువులను దగ్ధం చేయడాన్ని ఆలయ అధికారులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో దేవాలయాలపై దాడుల మీద దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది నరసింహస్వామి రథం తగులబడటానికి అసలైన కారకులెవరో ఇప్పటికీ తేల్చలేకపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో దేవతా విగ్రహాలను సైతం దుండగులు పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. వారిలో ఎవరికి ఏ స్థాయి శిక్ష పడిందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. జగన్ ప్రభుత్వం హిందూ సెంటిమెంట్ల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడం వల్లే హిందూ వ్యతిరేక శక్తులు చెలరేగిపోతున్నాయన్న విమర్శలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటి సమయాల్లో జగన్ స్ట్రిక్టుగా వ్యవహరించి ఉన్నట్టయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతర్రాష్ట్రంగా ప్రఖ్యాతి చెందిన కాణిపాకం ఆలయానికి చెందిన రథ చక్రాలు దగ్ధం చేయడం అంటే అది ఉద్దేశపూర్వకమే తప్ప అనుకోకుండా జరిగిన ఘటన కాదని, కాబట్టి ఈ ఘటనను అధికారులు లైట్ తీసుకోవడం సరికాదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అధికారులు సీరియస్ గా స్పందించకపోతే ఇక ఆ తరువాత దుండగుల లక్ష్యం స్క్రాప్ మాత్రమే కాదని, ఇంకా ఎంతకైనా తెగించి ఏమైనా చేసే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను దుండగులు ట్రయల్ వెర్షన్ గా చేసి ఉండవచ్చని, తదుపరి వారి టార్గెట్ ఇంకా ఏదో పెద్ద సబ్జెక్టే అయి ఉంటుందని అనుమనిస్తున్నారు. మరి కాణిపాకం అధికారులు రియాక్టవుతారా... చూడాలి మరి.