పశ్చిమబెంగాల్లో కన్నయాకుమార్ ప్రచారం
Published on: Sat Mar 5, 2016 9:36AM

పశ్చిమబెంగాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉండి, ప్రస్తుతం దీన స్థితిలో ఉన్న వామపక్షాలకు జేఎన్‌యూ వివాదం బాగానే కలిసివచ్చినట్లుంది. ప్రస్తుతం దేశ యువత నోళ్లలో నానుతున్న జేఎన్‌యూ వివాదాస్పద విద్యార్థి కన్నయాకుమార్‌ను అక్కడి ఎన్నికలలో వాడుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. ఈసారి ఎన్నికలలో ప్రజలు ఈ దేశ యువశక్తిని కూడా రుచి చూడనున్నారని ఏచూరి ఈ సందర్భంగా అన్నారు.
జేఎన్‌యూలో జరిగిన ఒక సమావేశానికి సంబంధించి దేశద్రోహం కేసు కింద కన్నయా అరెస్టై ప్రస్తుతం బెయిలు మీద విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కన్నయాకుమార్ చేసిన ఉపన్యాసాలకు యువత నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఎన్నికల సందర్భంతో కన్నయాను మమత ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. ఎందుకంటే అటు విద్యార్థులను కానీ, ఇటు హిందుత్వవాదులను కానీ నొప్పించకుండా ఉండేందుకు, జేఎన్‌యూ వివాదంలో ఇప్పటివరకూ మమత చూసీచూడనట్లు ఉన్నారు. కానీ ఆ వివాదానికి మూలపురుషుడే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా బరిలోకి దిగడంతో, మమతకు మాట్లాడక తప్పని స్థితి వచ్చింది.


