TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహాత్మ గాంధీది ముష్టి పాత్ర! కంగనా కామెంట్ల రచ్చ..

Published on: Fri Nov 12, 2021 12:04PM

మహాత్మాగాంధీ ముష్టిపాత్రలో మనకు స్వాతంత్ర్యం వచ్చిందట. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన కామెంట్ ఇది. దేశ వ్యాప్తంగా కంగనా కామెంట్ ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితమే కంగనా పద్మశ్రీ అవార్డు అందుకుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే కంగనాకు నలుగురి నుంచీ విమర్శలు ఎదుర్కోవడం మామూలైపోయింది.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగన ఇప్పుడు ఏకంగా భారత స్వాతంత్ర్యం పైనే తెగబడి కామెంట్ చేసింది. 1947లో మన దేశానికి వచ్చింది అసలు స్వాతంత్ర్యమే కాదట. మహాత్ముని చేతి ముష్టిపాత్రలో బ్రిటిష్ వాళ్లు వేసిన భిక్ష అని కంగనా తాజాగా వ్యాఖ్యానించింది. నిజానికి మన దేశానికి 2014లో మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందని ఈ అమ్మడు సెలవిచ్చింది. అంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే ఇండిపెండెన్స్ వచ్చిందని బాలీవుడ్ భామ భ్రమిస్తోంది.

గతంలో రైతును వేశ్యతో పోలుస్తూ కంగనా చేసిన దురుసు వ్యాఖ్య కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వందలాది మంది రైతులను ఉద్దేశించి కంగనా వ్యాఖ్యానించింది. కంగనా వ్యాఖ్య జాతి వ్యతిరేకం అని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమెకు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ లీగల్ నోటీసు పంపించింది.

హృతిక్ రోషన్, రచయిత జావేద్ అక్తర్ ను ఉద్దేశించి ‘బాలీవుడ్ లో కోటరీ వ్యవస్థా బలంగా నాటుకుపోయింది‘ అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కంగనపై జావేద్ అక్టర్ పరువునష్టం దావా వేశారు. నటుడు, గాయకుడైన దిల్జిత్ దోసాంజ్ తో అసభ్య పదజాలంతో వాదులాడి చిక్కుల్లో పడింది. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు పోస్టు చేస్తున్న కంగన అకౌంట్ ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఆత్మహత్యకు బాలీవుడ్ బడాబాబులే కారణమని వ్యాఖ్యానించిన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలు కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటివారు ఓ మాఫియాలా తయారయ్యారంటూ మరో సందర్భంలో కామెంట్ చేసి కాకరేపింది. నటి ఊర్మిళకు నటన రాదని, కేవలం అంగాంగ ప్రదర్శన చేసే శృంగారతారగా మాత్రమే ఆమెకు గుర్తింపు ఉందని కంగన వ్యాఖ్యానించింది.

టాలీవుడ్ జంట అక్కినేని చైతన్య- సమంత విడాకుల విషయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కీలకపాత్ర పోషించారని కంగన మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. అమీర్ ఖాన్ సలహాతో చైతు విడాకులు తీసుకున్నాడని కామెంట్ పెట్టింది. చైతు- సమంత భార్యాభర్తల బంధం విడాకులకు దారి తీయడానికి కారణం కచ్చితంగా పురుషులే అని కంగన పేర్కొనడం వివాదాస్పదం అయింది.

ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీరా? అంటూ కంగన చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్ర హోంమంత్రి ఘాటుగా స్పందించారు. కంగనకు ముంబైలో ఉండే హక్కు లేదని నిప్పులు చెరిగారు. తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా తాజాగా కోర్టు పనితీరుని కూడా తప్పుపట్టింది. కోర్టులు బెదిరింపులకు పాల్పడుతున్నాయంటూ ధిక్కార స్వరం వినిపించింది. కోర్టుల బెదిరింపుల కారణంగా తనకు న్యాయస్థానాలపై నమ్మకం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా పలుమార్లు కోర్టు నుంచి సమన్లు కూడా అందుకుంది.

కంగనా రనౌత్ భారత స్వాతంత్ర్యంపై తాజాగా చేసిన వ్యాఖ్యలపై వరుణ్ గాంధీ విరుచుకుపడ్డారు. కంగనాది పిచ్చి అనుకోవాలా? లేక దేశద్రోహంగా పరిగణించాలా? అంటూ నిప్పులు చెరిగారు. కంగన వ్యాఖ్యలు దేశద్రోహం కిందికే వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ తూర్పారపట్టింది. కంగనకు ఈ మధ్యనే ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశ ప్రజలకు కంగన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు. కంగనా ఓ విలాసవంతమైన యాచకురాలు అంటూ సీపీఐ జాతీయ నేత కే.నారాయణ వేడిగా స్పందించారు.