TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిమ్మగడ్డను కలిస్తే తప్పేంటి.. కామినేని సూటి ప్రశ్న

Published on: Tue Jun 23, 2020 6:42PM

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, తన పదవి కోసం కోర్టులో పోరాటం చేస్తున్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్ రహస్య భేటీ ఎపి రాజకీయాలలో పెను తుఫాన్ సృష్టిస్తోంది. ఈ ముగ్గురు అంత రహస్యంగా కలవవలసిన అవసరం ఏంటి.. అసలు దీనికి సూత్రధరి చంద్రబాబు అంటూ వైసిపి నేతలు విరుచుకు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భేటీలో పాల్గొన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. తాను ఎన్నికల కమిషనర్ డాక్టర్ రమేష్ కుమార్ ను కలిస్తే తప్పేంటని ఈ సందర్బంగా అయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ పదవి కాలాన్ని కుదించి ఆ పదవి నుండి ఆయనను కుట్రపూరితంగా తప్పించిందని దీనికి వ్యతిరేకంగా హైకోర్టులోను. సుప్రీం కోర్టులోనూ తాను పిటిషన్ వేశానని కామినేని గుర్తు చేసారు. బీజేపీ అధిష్టానం అనుమతితోనే తాను రాష్ట్ర ఎన్నికల సంఘం అంశం పై కోర్టులో సవాల్ చేసానని అన్నారు. ఇదే సందర్భంలో డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను తాను కలవడం తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

అదే సమయంలో తమ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా వచ్చారని దీంట్లో తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటని కామినేని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కుట్రపూరితంగా పదవి నుండి తప్పించి, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న వాళ్ళు సిగ్గుపడాలని ఆయన అన్నారు.

ఈ నెల 11న సుప్రీంకోర్టు లో జరిగిన వాదనల లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా డాక్టర్ రమేష్ కుమార్ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆయన విధుల్లో చేరకుండా అడ్డుకుంటోందని శ్రీనివాస్ అన్నారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని డాక్టర్ రమేష్ కుమార్ కోర్టులోనే ప్రస్తావించారని అందువల్ల తాము రహస్యంగా కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంటుందని ఈ సందర్బంగా శ్రీనివాస్ ప్రశ్నించారు. డాక్టర్ రమేష్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా లేరని అందువల్ల ఆయన స్వయంగా వచ్చి కలవడంలో ఎలాంటి తప్పు లేదని కామినేని తెలిపారు.