TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరిబాబు ఇది మంచి పద్ధతేనా?

Published on: Mon Oct 6, 2014 1:31PM

 

తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమయిన బీజేపీ కూడా అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీడియా ద్వారా చురకలు వేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు ఇదివరకోసారి ఆయన “చంద్రబాబు నాయుడు హైదరాబాదులో కూర్చొని ఏమి చేస్తున్నారు? వెంటనే రాష్ట్రానికి తరలిరాకుండా అక్కడి నుండే పాలిస్తానంటే ఎలా?” అని నిలదీశారు.

 

ఆ తరువాత వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ కూడా బలమయిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. మళ్ళీ నిన్న గుంటూరులో జరిగిన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని కోసం లక్ష ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిని వికేంద్రీకరించే అవకాశం ఉన్నప్పటికీ, విజయవాడ-గుంటూరు పరిధిలో ప్రభుత్వం లక్ష ఎకరాల భూమి సేకరించాలనే ఆలోచనను ఆయన తప్పు పట్టారు.

 

ఆయన విమర్శలు సహేతుకమయినవే కావచ్చును. కానీ అధికార పార్టీకి మిత్ర పక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ కొనసాగుతున్నప్పుడు, ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని తామే విమర్శించుకొన్నట్లవుతుంది. అనేకమంది తెదేపా నేతలు, ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి వంటివారు కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. కానీ తరువాత ప్రభుత్వనిర్ణయానికి అందరూ కట్టుబడి మౌనం వహించారులక్ష ఎకరాల భూసేకరణపై ప్రతిపక్షాల నుండి వస్తున్నవిమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఇప్పుడు నిర్మించబోయే రాజధాని ప్రస్తుత జనాభా, ఆ ప్రాంత అభివృద్ధిని మాత్రమే కాకుండా రాబోయే 100 సం.లకు సరిపోయే విధంగా రాజధానిని తీర్చిదిద్దేందుకే సేకరిస్తున్నామని చెప్పిన సమాధానం బహుశః హరిబాబు దృష్టికి రాలేదేమో?

 

ఏమయినప్పటికీ కంబంపాటి హరిబాబు ప్రభుత్వంపై ఈ విధంగా బహిరంగ విమర్శలు చేయడం కంటే నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి తన అభిప్రాయం తెలియజేస్తే బాగుంటుంది కదా. మిత్రపక్షమయి ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వలన రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తినడం మినహా ఒరిగేదేముంటుంది?