కామారెడ్డిలో హోరాహోరీ పోటీ?
Published on: Sat Mar 17, 2012 11:38AM
త్రిముఖపోటీ నెలకొనివున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల మూడు వేలమంది ఓటర్లు ఉండగా అందులో 98,960 మంది పురుష ఓటర్లు, 1,04,138 మంది మహిళా ఓటర్లు. కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల రాజారెడ్డి, టిడిపి అభ్యర్థి ఎన్. వేణుగోపాలరావు, టిఆర్ఎస్ అభ్యర్ధి గంప గోవర్ధన్ ల మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల రాజారెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ ఇక్కడ నుంచి మూడోసారి పోటీచేస్తున్నారు. గంప గోవర్ధన్ రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టిఆర్ ఎస్ అభ్యర్థిగా మూడోసారి రంగంలో ఉన్నారు. టిడిపి అభ్యర్ధి ఎన్. వేణుగోపాలరావు మొదటిసారిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో హంగూ ఆర్భాటాలకు పోకుండా వ్యూహ రచనలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ వల్ల ఏదో ఒక లబ్ధి చేకూరిందని, అందువల్ల తమ అభ్యర్ధి విజయం ఖాయమని కాంగ్రెస్ అంటోంది. టిడిపి అభ్యర్ధి వేణుగోపాలరావు ప్రభుత్వ వ్యతిరేఖ ఓటుతోపాటు గంప గోవర్ధన్ పై ఓటర్లలో ఉన్న వ్యతిరేకతపై కూడా ఆశలు పెట్టుకున్నారు. గంప గోవర్ధన్ మాత్రం తెలంగాణా వాదమే తనను గట్టేక్కిస్తుందన్న ధీమాతో ఉన్నారు.


