కామారెడ్డిలో టి.ఆర్.ఎస్.కు సవాల్ విసురుతున్న కాంగ్రెస్, దేశం
Published on: Mon Mar 5, 2012 9:20AM
కామారె
డ్డి: కామారెడ్డి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ ఎన్నికల పోరు జరుగనుంది. ఎన్నికలపై తెలంగాణా సెంటిమెంట్ గట్టిగా ఉంటుందని మొదట భావించినప్పటికీ కొత్త సమీకరణాలు రావడంతో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. టిఆర్ఎస్ ముఖ్యనేత యూసుఫ్ అలీ టిడిపిలో చేరడం, షబ్బీర్ అలీ పోటీనుంచి తప్పుకుని కాంగ్రెస్ టిక్కెట్ ను రాజారెడ్డికి ఇప్పించడం, టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరి తెలంగాణా తరపున పోటీకి దిగిన గంపా గోవర్ధన్ కు పార్టీలో కుంపట్లు ఉండటం రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది. ఈ పరిస్థితి ఆయా పార్టీల ఇన్ ఛార్జిలకు కూడా పెను సవాలుగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జిగా మంత్రి సుదర్శన్ రెడ్డి, టిడిపి ఇన్ ఛార్జి గా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ ఇన్ ఛార్జిగా కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కెటిఆర్ వ్యవహరిస్తున్నారు. ఈ ఫలితం పోటీచేస్తున్న అభ్యర్ధులతో పాటు వీరికి కూడా ఒక పరీక్ష కాబోతోంది. ఇటీవల జరిగిన బాన్సువాడ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సైతం టిడిపి, కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉందనే భయంతో బాన్సువాడలో అసలు టిడిపి పోటీచేయలేదు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్టు దక్కడంతో తెలంగాణా రాజకీయంలో పెనుమార్పులు చోటుచేసున్నాయి. ఉప ఎన్నిక తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో పర్యటించారు. చంద్రబాబుతో పాటు జగన్ కూడా ఈ జిల్లాల్లో పర్యటించారు. తర్వాత అన్ని పార్టీల నాయకులు కూడా నిర్భయంగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. ఇది కార్యకర్తలతోపాటు రాజకీయ పార్టీల్లో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈ నాయకులంతా ఇప్పుడు కామారెడ్డిలో ఉత్సాహంతో తిరుగుతున్నారు. కామారెడ్డిలో ఇప్పుడు టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్య త్రిముఖ పోటీ జరుగునున్నది. డిపాజిట్ల సంగతి పక్కన పెట్టి విజయం కోసం మూడు పార్టీలు హోరా హోరీ పోటీపడే అవకాశం కనిపిస్తోంది.


