కామారెడ్డిలో పుంజుకుంటున్న సైకిల్
Published on: Tue Feb 28, 2012 3:35PM
కా
మారెడ్డి: ఉప ఎన్నిక నేపధ్యంలో కామారెడ్డిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డిపాజిట్ కూడా దక్కదనుకున్న టిడిపి అనూహ్యంగా పుంజుకుంటుంది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉప పోరు ఉంటుందని మొదట భావించినప్పటికీ టిడిపి బలపడుతున్న తీరుతో ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా చేసుకుని మరింత పకడ్బందీ వ్యూహ రచనతో ఎన్నికల బరిలో దిగాలని పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నారు. స్వయానా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సైతం కామారెడ్డిలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందంటూ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో నేతలను వెన్నుతట్టారు. నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఒక ఎమ్మెల్యేను, మరో రాష్ట్ర నేతను చంద్రబాబునాయుడు రంగంలోకి దింపుతున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధ్గులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కిన్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న జిల్లాలో టిడిపి విపత్కర పరిస్థితుల్లో పడింది. ఎన్నికల ఫలితాల ప్రభావం పార్టీ రాష్ట్ర కమిటీని సైతం ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి ఉప ఎన్నికను అగ్ర నాయకత్వం సవాలుగా తీసుకుంది. ఉప ఎన్నికలో గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా తమ ఓటు బ్యాంక్ పదిలంగా ఉందనే సంకేతాలు పంపేవిధంగా ఫలితాలు రావాలని పార్టీ నాయకత్వం ఆశిస్తోంది.
2009 సాధారణ ఎన్నికల సమయంలో పార్టీనుంచి వెళ్ళిపోయినా సీనియర్ నేత యూసుఫ్ అలీ మళ్ళీ టిడిపిలో చేరడంతో ఆ పార్టీ మరింత బలపడినట్లయింది. ఇంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న మైనార్టీలు ఆయన రాకతో దగ్గరయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్, టిఆర్ఎస్ లలో అసంతృప్తులపై టిడిపి అగ్రనేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ అభ్యర్ధి గంప గోవర్ధన్ మొన్నటి వరకు టిడిపిలోనే పనిచేసినందున ఆయన వెంటఉన్న కీలక నాయకులు, ముఖ్యకార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.


