కామారెడ్డిలో సైకిల్ స్పీడందుకొనేనా?
Published on: Fri Feb 24, 2012 2:08PM
కామారె
డ్డి: తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీ పార్టీకి ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక విషమ పరీక్షగా మారింది. ఇప్పటికే తెలంగాణా నినాదంతో తెరపైకి వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాభావాలను చవి చూసిన టిడిపి శ్రేణులు కామారెడ్డి ఉప ఎన్నికల్లోనైనా గట్టి పోటీనిచ్చి ఉనికిని చాటుకుంటారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టమైనప్పటికీ కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్యే హోరా హోరీ పోరు ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ వేణుగోపాలరావును ఇప్పటికే తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. టిడిపి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, హనుమంత్ షిండె, అన్నపూర్ణమ్మ, ఇతర ముఖ్యనేతలంతా కామారెడ్డిలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను సమాయత్త పరిచారు. ప్రత్యేక తెలంగాణాకు టిడిపి ఎంతమాత్రం వ్యతిరేకం కాదనే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఇటీవల బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్ధిని బరిలో నిలపకపోవడం వల్ల లాభంకంటే ఎక్కువగా నష్టమే జరిగిందని స్థానిక నాయకులు అంటున్నారు. ఓటమి భయంతోనే బాన్సువాడలో టిడిపి పోటీ చేయలేదన్న అపవాదును మూటగట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కామారెడ్డి ఉప పోరులో తలపడాలని టిడిపి నాయకత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టు ఉండేది. అయితే తెలంగాణావాదం బలపడిన తరువాత టిడిపి ఇక్కడ బలహీనపడింది. 2010 ఉప ఎన్నికల్లో ఒక్కసారిగా డీలా పడింది. నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులు కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయారు. కామారెడ్డి ఉప ఎన్నికల్లో మళ్ళీ అటువంటి పరాభవమే ఎదురవుతుందనే భయంతో తెలుగు తమ్ముళ్ళు ముమ్మర ప్రచారానికి సన్నద్దమవుతున్నారు.


