సీఎం జగన్ మేనమామకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వెల్లటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. సోలార్ ప్లాంట్ వద్దంటూ మూడు గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. గ్రామాల్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా రాళ్లు పెట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. సీఎం జగన్ మేనమామ అయిన రవీంధ్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురవడం చర్చనీయాంశమైంది. 

కాగా, కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో కొత్తగా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతంలో స్ధల పరిశీలన కోసం అధికారులు వెళ్లారు. వారితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే, వారు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో సాగు భూములు ఎక్కువ ఉన్నందున సోలార్ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.